
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి బొగ్గు, విద్యుత్ బకాయిలు రూ.29 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్పార్పీ 3 బొగ్గు గనిపై బుధవారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యం కారణంగా సింగరేణి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. సింగరేణికి ఇచ్చిన నిధులను సర్కార్ ఖజానాకు మళ్లించుకోవడంతో కార్మికులకు జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో వచ్చిన లాభాలను ప్రకటించి 35 శాతం వాటాను జూన్‌లోనే కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్‌కే బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, ఫిట్ కార్యదర్శి మురళీచౌదరి, నాయకులు మారుపెల్లి బాబు, ఆఫ్రోజ్‌ఖాన్ పాల్గొన్నారు.