కార్మికుల మనస్సు గెలుచుకున్న ఏఐటీయూసీ

  •     కార్మికుల మనస్సు గెలుచుకున్న ఏఐటీయూసీ 
  •     కొద్ది ఓట్ల తేడాతో ‘గుర్తింపు’ హోదా  కోల్పోయిన ఐఎన్‌‌‌‌టీయూసీ 
  •     చెల్లాచెదురై చెదిరిపోయిన టీబీజీకేఎస్‌‌‌‌
  •     ప్రభావం చూపని సీఐటీయూ,  బీఎంఎస్, హెచ్ఎంస్​

గోదావరిఖని/కోల్‌‌‌‌ బెల్ట్‌‌, వెలుగు‌‌: గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కార్మికులు అనూహ్య తీర్పునిచ్చారు. 1998 నుంచి ఏడు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సార్లు జాతీయ కార్మిక సంఘాలకే పట్టం కట్టారు. ప్రభుత్వాలకు అనుబంధంగా ఉన్న సంఘాల వల్ల సమస్యలు పరిష్కారం కావని, హక్కులు నెరవేర్చుకోలేమని, పోరాట సంఘాలే అండగా ఉంటాయని భావించిన కార్మికులు ఈసారి ఏఐటీయూసీ వైపు మొగ్గు చూపారు. ప్రచారానికి తక్కువ టైమ్ ఉన్నా.. తుది వరకూ పోరాడిన ఐఎన్​టీయూసీ.. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో ఏఐటీయూసీకి గట్టి పోటీ ఇచ్చింది. ఎక్కువ ఏరియాలను గెలిచినా ఓట్ల పరంగా తక్కువ రావడంతో ‘గుర్తింపు’ హోదాను కోల్పోయింది. ఇక బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అనుబంధ టీబీజీకేఎస్‌‌‌‌లోని ముఖ్య లీడర్లు తమ పదవులకు రాజీనామా చేయడంతో క్యాడర్‌‌‌‌ అంతా చెల్లాచెదురై ఇష్టమున్న యూనియన్‌‌‌‌లో చేరిపోయింది. తెలంగాణవాదం పేరుతో రెండు సార్లు గుర్తింపు సంఘంగా వ్యవహరించిన టీబీజీకేఎస్‌‌‌‌ తాజా పరిణామాల నేపథ్యంలో సింగరేణిలో ఉనికిలో లేకుండా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

43 శాతం ఓట్లతో ఏఐటీయూసీకి హోదా...

సింగరేణిలో మొత్తం 11 డివిజన్లుండగా ఐదింటిలో సింగరేణి కాలరీస్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ (ఏఐటీయూసీ), ఆరింటిలో సింగరేణి కోల్‌‌‌‌మైన్స్‌‌‌‌ లేబర్‌‌‌‌ యూనియన్‌‌‌‌ (ఐఎన్‌‌‌‌టీయూసీ) గెలిచాయి. అయితే ఓట్ల పరంగా చూస్తే ఏఐటీయూసీ 16,177 (43.20 శాతం) ముందుండడంతో ఆ యూనియన్‌‌‌‌కు ‘గుర్తింపు సంఘం’ హోదా దక్కింది. ఆ తర్వాత 14,178 (37.86 శాతం) ఓట్లతో రెండో స్థానంలో ఐఎన్‌‌‌‌టీయూసీ నిలిచి ‘ప్రాతినిధ్య సంఘం’ హోదాను పొందింది. ఈ రెండు యూనియన్ల మధ్య తేడా 1,999 ఓట్లు మాత్రమే. ‌‌

ఇదిలా ఉండగా 2017లో జరిగిన ఎన్నికల్లో మందమర్రి, భూపాలపల్లి డివిజన్లలో ఏఐటీయూసీ ప్రాతినిధ్యం నిలుపుకోగా ఈ సారి భూపాలపల్లి డివిజన్‌‌‌‌ను కోల్పోయింది. ఏఐటీయూసీకి ‘గుర్తింపు’ హోదా దక్కడానికి కార్మికులు ఎక్కువగా ఉన్న శ్రీరాంపూర్‌‌‌‌ డివిజనే కారణమైంది. ఈ ఒక్క డివిజన్‌‌‌‌లోనే ఏఐటీయూసీకి 2,166 ఓట్ల మెజార్టీ వచ్చింది. శ్రీరాంపూర్‌‌‌‌లో టీబీజీకేఎస్‌‌‌‌ యూనియన్‌‌‌‌ ఏరియా వైస్‌‌ ‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ సురేందర్‌‌‌‌ రెడ్డి ఐఎన్‌‌‌‌టీయూసీ‌‌లో చేరగా, టీబీజీకేఎస్‌‌‌‌ లోని మిగతా వారు ఏఐటీయూసీలో చేరారు. ఇది ఆ యూనియన్​కు కలిసి వచ్చింది.  

టీబీజీకేఎస్‌‌‌‌ కు దిక్కెవరు?

సింగరేణిలో 2012, 2017 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ‘గుర్తింపు’ హోదాను దక్కించుకున్నది. 2012లో 23,311 ఓట్లతో (38.69 శాతం), 2017లో 23,848 ఓట్లతో (45.40 శాతం) విజయం సాధించింది. కానీ, తాజా ఎన్నికల్లో మాత్రం 1,298 ఓట్లతో (3.47 శాతం) నామమాత్రంగా మిగిలింది. ఒక్క మణుగూరు డివిజన్‌‌‌‌లో అక్కడి ఏరియా వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌రావు కష్టపడడంతో ఏఐటీయూసీ, ఐఎన్‌‌‌‌టీయూసీ యూనియన్లకు దీటుగా 728 ఓట్లను సంపాదించుకోగలిగింది. 

ఇక మిగిలిన డివిజన్లలో ఏఐటీయూసీకి.. టీబీజీకేఎస్‌‌‌‌ బహిరంగంగానే మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేసింది. టీబీజీకేఎస్‌‌‌‌ అగ్రనేతలు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్య పదవులకు రాజీనామా చేసిన తర్వాత ఆ యూనియన్‌‌‌‌కు కేంద్ర స్థాయిలో నాయకత్వ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆ యూనియన్‌‌‌‌కు దిక్కెవరనేది ఇంకా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధిష్ఠానం ప్రకటించలేదు. కానీ, ఎన్నికలకు ముందే టీబీజీకేఎస్‌‌‌‌లో ఉన్న చాలా మంది ద్వితీయశ్రేణి లీడర్లంతా ఇతర యూనియన్లలో చేరిపోయారు. రానున్న రోజుల్లో ఆ యూనియన్‌‌‌‌ ఉనికి ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

చతికిలపడ్డ సీఐటీయూ, బీఎంఎస్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌  

సింగరేణిలో తమకు ఎంతో బలం ఉందని ప్రచారం చేసుకున్న జాతీయ సంఘాలైన సీఐటీయూ, బీఎంఎస్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ సంఘాలు చతికిలపడ్డాయి. తాజాగా జరిగిన  ఎన్నికల్లో సీఐటీయూ 3,710 ఓట్లు (9.91 శాతం) సాధించింది. రామగుండం రీజియన్‌‌‌‌లోని మూడు డివిజన్లతో పాటు మందమర్రి, శ్రీరాంపూర్‌‌‌‌లో ఆ యూనియన్​ ఎక్కువ ఓట్లు రాబట్టుకోగలిగింది. 2017 ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా వచ్చిన 1,646 ఓట్ల (3.13 శాతం) తో పోలిస్తే తాజాగా వచ్చిన ఓట్లు ఎక్కువే. ఇక 917 ఓట్ల (2.45 శాతం)తో బీఎంఎస్‌‌‌‌, 947 ఓట్ల (2.53 శాతం)తో హెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ యూనియన్లు నామమాత్రమయ్యాయి. మిగిలిన విప్లవ కార్మిక సంఘాలకు కూడా తక్కువ సంఖ్యలోనే  ఓట్లు వచ్చాయి.  

ఏడేండ్ల తర్వాత ఐఎన్‌‌‌‌టీయూసీ గెలుపు

సింగరేణిలో 2012లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేట్‌‌‌‌, మణుగూరు డివిజన్లలో గెలిచిన ఐఎన్‌‌‌‌టీయూసీ యూనియన్‌‌‌‌ ప్రాతినిధ్య హోదాతో 2017 వరకు పనిచేసింది. జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వం జరిపిన చర్చల నేపథ్యంలో 2017లో జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌‌‌‌టీయూసీ.. ఏఐటీయూసీకి బేషరతుగా మద్దతు పలికింది. తాజా ఎన్నికల్లో కూడా  ఈ రెండు యూనియన్ల మధ్య పొత్తు ఉంటుందని భావించినప్పటికీ అది కుదరలేదు. ఏఐటీయూసీ, ఐఎన్‌‌‌‌టీయూసీ మధ్యనే హోరాహోరీ పోరు నడవగా మంత్రులు, ఎమ్మెల్యేల సంపూర్ణ సహకారంతో కొత్తగూడెం కార్పొరేట్‌‌‌‌, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, రామగుండం–3, భూపాలపల్లి డివిజన్లలో ఐఎన్​టీయూసీ విజయ ఢంకా మోగించింది. ఏడేండ్ల తర్వాత ఐఎన్‌‌‌‌టీయూసీ మళ్లీ ప్రాతినిధ్య హోదా దక్కించుకున్నది.