‘ఆర్ఎక్స్ 100’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు అజయ్ భూపతి డైరెక్షన్‌లో పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం ‘మంగళవారం’. అజ్మల్ అమీర్ హీరోగా నటించాడు. ఎం. సురేష్ వర్మ, స్వాతి రెడ్డి గునుపాటి, అజయ్ భూపతి నిర్మించారు. ఈనెల 17న సినిమా విడుదలవుతున్న సందర్భంగా పాయల్ మాట్లాడుతూ ‘నాకు మరో అవకాశం ఇవ్వాలని అజయ్ భూపతిని ఎప్పటి నుంచో అడుగుతున్నా. చిన్న చిన్న పాత్రలకు తీసుకోలేను, మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా చెబుతానన్నారు.
మధ్యలో ఓ సారి కాల్ చేసినప్పుడు ‘మంగళవారం’ సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నట్టు చెప్పారు. అప్పటికే సుమారు నలభై మందిని ఆడిషన్స్ చేశారు. నన్నెందుకు తీసుకోవడం లేదు, నా కెరీర్‌కు హెల్ప్ అవుతుందని అడగడంతో ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేశారు. కథ వినగానే ఈ క్యారెక్టర్ నిజమేనా అని అడిగా. ఇంటెన్స్, డార్క్ రోల్స్ నేను కూడా చేశాను కానీ ఇటువంటి సినిమా, క్యారెక్టర్ మాత్రం చేయలేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసిన సినిమా ఇది.
మన దేశంలో ఈ తరహా క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు. చాలా చాలెంజింగ్ రోల్. ఆ పాత్రలో నటించడం చాలా కష్టమైంది. నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు ఇందులోని శైలు పాత్రకు పది శాతం కూడా పోలిక లేదు. దర్శకుడిపై పూర్తి నమ్మకంతో ఆయన చెప్పింది చెప్పినట్టు చేశా. సినిమా చూశాక ఆ అమ్మాయి మీద అందరికీ సింపతీ వస్తుంది. చాలా సెన్సిటివ్ విషయాన్ని డిస్కస్ చేశాం. సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. మేకప్‌కు రెండు గంటలు టైమ్ పడితే.. క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. టాలెంటెడ్ టెక్నీషియన్లు సినిమాకు పని చేశారు. తెలుగులో నాకు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నా’ అని చెప్పింది.