
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రైడ్ 2’. 2018లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కు ఇది సీక్వెల్. రాజ్ కుమార్ గుప్తా దర్శకుడు. రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. 74 రైడ్స్, అలాగే 74 ట్రాన్స్‌ఫర్స్, సీజ్ చేసిన మొత్తం రూ.4200 కోట్లు... అమయ్ పట్నాయక్ ఈజ్ బ్యాక్.. ” అంటూ అజయ్ దేవగణ్ పోషిస్తున్న ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ పాత్రను పరిచయం చేశారు. తన ఐటీ రైడ్స్‌తో పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, బిగ్ షాట్స్‌కు చెమటలు పట్టించే అమయ్ పట్నాయక్‌కు ఈసారి దాదా భాయ్ అనే ఓ బడా పొలిటీషియన్ ఇంటిపై రైడ్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయి. ఇది తనకు 75వ ఐటీ రైడ్. దాదా భాయ్ పాత్రను రితేష్ దేశ్‌ముఖ్ పోషించాడు.
మీ పాండవులు ఎప్పటినుంచి నాపై చక్రవ్యూహం పన్నుతున్నారు అని ఫోన్‌లో రితేష్ అడుగుతుంటే.. నేను పాండవ అని ఎప్పుడూ చెప్పలేదే, పూర్తి మహాభారతమే నేను’ అంటూ అజయ్ దేవగణ్ చెప్పిన డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈసారి ఐటీ రైడ్ ఎలా ఉండబోతోంది అనేది మిగతా కథ. రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాఠక్ ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భూషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. మే 1న సినిమా విడుదల కానుంది.