
పాకిస్థాన్ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ లో ముగిసింది. దీనికి కారణం టీమిండియా అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భద్రత కారణాల వలన పాకిస్థాన్ కు వెళ్ళడానికి బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాల్సి వచ్చింది. దీని ప్రకారం భారత్ తమ మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే నిర్వహించాల్సి వచ్చింది. భారత్ సెమీస్ ఫైనల్ కు రావడంతో కీలకమైన సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు కూడా దుబాయ్ వేదికగా జరిగాయి. ఇదిలా ఉంటే భారత్ లాహోర్ లో విజయం సాధించి కప్ అందుకుంటే బాగుండేదని భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తన అభిప్రాయాన్ని తెలిపాడు.
జడేజా మాట్లాడుతూ.. " పాకిస్థాన్ జట్టు ఆశించిన ప్రదర్శన చేయకపోయినా వారికి నా శుభాకాంక్షలు. దుబాయ్ కు పాకిస్థాన్ అభిమానులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. లాహోర్‌లో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిస్తే ఇంకా బాగుండేది. వారి విజయానికి ఇంకా పరిపూర్ణత వచ్చేది". అని స్పోర్ట్స్ సెంట్రల్ యొక్క 'ది డ్రెస్సింగ్ రూమ్' షోలో అజయ్ జడేజా అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ప్రెజెంటేషన్ వేడుకలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి ఎవరూ కనిపించకపోవడంతో మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఇది వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ వంటి పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లను తీవ్ర అసహనానికి గురి చేసింది.
ALSO READ | Team India: ఎవరింటికి వాళ్ళే.. ఈ సారి బస్ పరేడ్ వేడుకలు లేవు.. కారణమిదే!
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలుత స్పిన్నర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ మాత్రమే చేసింది. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (83 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76) ముందుండి నడిపించడంతో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. జట్టును గెలిపించిన రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఏడాది కిందటే టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీతో తన ఖ్యాతిని పెంచుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌కు మొత్తంగా ఇది ఏడో టైటిల్. వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు, ఆసియా కప్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించినా.. మూడు ఫార్మాట్లలో మరెన్నో రికార్డులు కొల్లగొట్టినా. ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియాకు చాలామట్టుకు చేదు జ్ఞాపకాలే! అప్పటిదాకా గొప్పగా ఆడుతూ.. అంచనాలు పెంచేసి అసలైన సమయంలో ఉసూరుమనిపించే మన జట్టు 2013 నుంచి 2024 వరకు 11 ఏండ్ల పాటు ఒక్క ఐసీసీ ట్రోఫీ నెగ్గలేక అభిమానులను నిరాశపరిచింది..! కానీ, ఇప్పుడు మన ఆట మారింది. రాత కూడా మారింది. ఏడాది తిరగకుండానే రెండో ఐసీసీ ట్రోఫీ మన సొంతమైంది.