Ajinkya Rahane: మా అమ్మ కష్టం మరువలేనిది.. కష్టాలను చెప్పుకుంటూ రహానే ఎమోషనల్

Ajinkya Rahane: మా అమ్మ కష్టం మరువలేనిది.. కష్టాలను చెప్పుకుంటూ రహానే ఎమోషనల్

టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే భారత జట్టులోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవలే రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న రహానే మళ్ళీ టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తానని ధీమా వ్యక్తం చేశాడు. దశాబ్ద కాలం పాటు రహానే భారత టెస్ట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఎలాంటి విమర్శలు లేకుండా క్రికెట్ కెరీర్ లో ముందుకు వెళ్తున్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో రహానే ఒకడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ ఆడుతూ బిజీగా ఉన్న రహానే.. ఈ మ్యాచ్ కు ముందు తాను చిన్న వయసులో పడిన కష్టాలను గుర్తు చేసుకున్నాడు. 

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రహానే తన బాల్య దశలో ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన తల్లి కుటుంబ ఖర్చులను భరించడానికి చాలా కష్టపడిందని తెలిపాడు. "నేను డోంబివ్లి నుండి వచ్చేవాడిని. రైలు ప్రయాణం నాకు ఛాలెంజిగ్ గా ఉండేది. మా నాన్న ఆఫీసుకు వెళ్లడంతో నేను ఎనిమిదేళ్ల వయస్సు నుండి ఒంటరిగా ప్రయాణించేవాడిని.  మా నాన్న సంపాదన సరిపోకపోవడంతో మా అమ్మ డబ్బు సంపాదించడానికి పిల్లలను చూసుకునేది. ఆ జ్ఞాపకాలు నా మనసులో ఉన్నాయి. ఈ కీర్తి, డబ్బు ఈ ఆట వల్లనే వచ్చాయి" అని రహానే చెప్పుకొచ్చాడు. 

అగ్ర శ్రేణి క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ లగ్జరీగా జీవించాలనే భావన నాలో లేదు. నేను నా జీవితంలో చాలా ఆలస్యంగా కారు కొన్నాను. నీలేష్ కులకర్ణి, అవిష్కర్ సాల్వి, ప్రవీణ్ తంబేలను లిఫ్ట్ అడిగి వెళ్ళేవాడిని. దేశం తరపున ఆడుతున్నప్పుడు   సెకండ్ హ్యాండ్ వ్యాగన్ఆర్ కొన్నాను. జనాలు పెద్ద కారు కొను అని అనేవారు. కానీ నాకు మాత్రం సౌకర్యంగా అనిపించేది కాదు. రెండు  సంవత్సరాల తర్వాత నేను హోండా కొన్నాను".  అని ఈ రహానే తెలిపాడు. 

రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో  జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది. జాతీయ జట్టుకు దూరమైన రహానే.. దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 45.76 సగటుతో 13,000కిపైగా పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 39.72 సగటుతో  6475 పరుగులు చేశాడు.