IPL 2025: అయ్యర్, నరైన్, రస్సెల్‌కు షాక్.. కోల్‌కతా కెప్టెన్‌గా టెస్ట్ స్పెషలిస్ట్

IPL 2025: అయ్యర్, నరైన్, రస్సెల్‌కు షాక్.. కోల్‌కతా కెప్టెన్‌గా టెస్ట్ స్పెషలిస్ట్

2025 ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఎవరనే విషయంలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కావడంతో కేకేఆర్ పగ్గాలు ఎవరు చేపడతారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.  గత సీజన్ లో కేకేఆర్ జట్టును నడిపించిన శ్రేయాస్ అయ్యర్ ఆ ఫ్రాంచైజీతో తెగదెంపులు చేసుకొని పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు. అయ్యర్ రూ. 26.75 కోట్ల భారీ బిడ్‌ను వెచ్చించి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోగా అతని స్థానంలో కెప్టెన్సీ ఎవరికీ దక్కుతుందో అనే చర్చ మొదలైంది. 

వస్తున్న నివేదికల ప్రకారం టీమిండియా ప్లేయర్.. మాజీ ఐపీఎల్ కెప్టెన్ అజింక్య రహానేను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా నియమించనున్నట్టు తెలుస్తుంది. కెప్టెన్సీ రేస్ లో రహానే ముందు వరుసలో ఉన్నాడని.. 90 శాతం అతడే కేకేఆర్ జట్టును నడిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. రహానే గతంలో రాజస్థాన్ రాయల్స్, పూణే జట్లకు కెప్టెన్ గా ఉన్నాడు. భారత టెస్ట్ వైస్ కెప్టెన్ గా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిపించిన ఘనత అతని సొంతం. కెప్టెన్సీ అనుభవంతో పాటు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే రహానేకు కెప్టెన్సీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. 

ALSO READ : పింక్‌‌ ప్రాక్టీస్‌లో ఇండియా పాస్‌‌..6 వికెట్ల తేడాతో పీఎం ఎలెవన్‌‌పై గెలుపు.. మెరిసిన గిల్‌, హర్షిత్‌

రహానే మొదట ఐపీఎల్ మెగా ఆక్షన్ లో మొదట ఎవరూ కొనలేదు. అయితే తర్వాత రౌండ్ లో రూ. 1.5 కోట్ల రూపాయల కనీస ధరకు  అతడిని కేకేఆర్ దక్కించుకుంది. రహానే కెప్టెన్సీ రేస్ లోకి రావడంతో వెంకటేష్ అయ్యర్ కు నిరాశే మిగిలింది. వేలంలో వెంకటేష్ అయ్యర్ ను కోల్ కతా జట్టు రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. కెప్టెన్సీ కోసమే అతన్ని అంత భారీ మొత్తంలో వెచ్చించారనే వార్తలు వచ్చాయి. దీనికి తోడు అయ్యర్ తనకు కెప్టెన్సీ మీద ఆసక్తి ఉంది అని తెలియజేయడంతో అతడే కెప్టెన్ అని అందరూ అనుకున్నారు. మరోవైపు సీనియర్ ప్లేయర్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లకు కెప్టెన్సీ ఇస్తారనుకుంటే నిరాశే మిగిలింది.