Ranji Trophy 2025: క్లాస్ ఈజ్ పర్మినెంట్: 200వ టెస్టులో టీమిండియా వెటరన్ క్రికెటర్ సెంచరీ

Ranji Trophy 2025: క్లాస్ ఈజ్ పర్మినెంట్: 200వ టెస్టులో టీమిండియా వెటరన్ క్రికెటర్ సెంచరీ

టీమిండియా వెటరన్ బ్యాటర్.. మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్య రహానే దేశవాళీ క్రికెట్ లో తన సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. ఫామ్ టెంపరరీ.. క్లాస్ పర్మినెంట్ అనే ట్యాగ్ కు న్యాయం చేస్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో జట్టులో స్థానం దక్కకపోయినా రంజీ ట్రోఫీలో తన సొగసైన ఆట తీరుతో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. రెండేళ్ల క్రితమే భారత టెస్టులో స్థానం కోల్పోయినా నిరాశ చెందకుండా తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉంటున్న రహానే సెంచరీతో సత్తా చాటి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మంగళవారం (ఫిబ్రవరి 11) హర్యానాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో సత్తా చాటాడు.

కోల్‌కతాలో హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో రెండో ఇన్నింగ్స్ లో 180 బంతుల్లో 13 ఫోర్లతో 108 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రెబ్ బాల్ క్రికెట్ లో రహానేకు ఇది 200 వ మ్యాచ్ కావడం విశేషం. ఓవర్ నైట్ స్కోర్ 88 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన రహానే.. నాలుగో రోజు తొలి సెషన్ లో తన సెంచరీ మార్క్ ను పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రహానేకు ఇది 29వ సెంచరీ. టెస్ట్ క్రికెట్‌లో 12 సెంచరీలు బాదిన ఈ ముంబై క్రికెటర్.. మొత్తం రెండ్ బాల్ క్రికెట్ లో 41 ఫస్ట్-క్లాస్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. 

Also Read :  గుజరాత్ టైటాన్స్‌‌ను కొనుగోలు చేయనున్న టోరెంట్ గ్రూప్

రహానే సెంచరీతో పాటు సూర్య కుమార్ యాదవ్ (70) హాఫ్ సెంచరీ చేయడంతో ముంబై రెండో ఇన్నింగ్స్ లో 339 పరుగుకు ఆలౌటైంది. మూడో రోజు సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో హర్యానాకు ముంబై 354 పరుగుల టార్గెట్ ను సెట్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో హర్యానా ఓటమి దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. హర్యానా గెలవాలంటే మరో 279 పరుగులు చేయాలి. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో ముంబై 315 పరుగులు చేయగా.. హర్యానా 301 పరుగులకు ఆలౌట్ అయింది. 

రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో  జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.