Ranji Trophy 2025: అదృష్టం అంటే ఇదే! గ్రౌండ్ వదిలి వెళ్లిన క్రికెటర్‌ను బ్యాటింగ్‌కు పిలిచిన అంపైర్లు

Ranji Trophy 2025: అదృష్టం అంటే ఇదే! గ్రౌండ్ వదిలి వెళ్లిన క్రికెటర్‌ను బ్యాటింగ్‌కు పిలిచిన అంపైర్లు

రంజీ ట్రోఫీలో వింత సంఘటన ఒకటి చోటు చేసుకుంది. క్లియర్ గా ఔటై పెవిలియన్ కు చేరిన ఆటగాడిని అంపైర్లు వెనక్కి పిలవడం వైరల్ అవుతుంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. తొలి రోజు ఆటలో భాగంగా ముంబై- జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.  ముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానె వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి గ్రౌండ్ వదిలి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళాడు. అయితే నో బాల్ కావడంతో రహానేను వెనక్కి పిలవాల్సి వచ్చింది. 

గ్రౌండ్ వదిలి వెళుతున్నప్పుడు నో బాల్ చెక్ చేయాలని అంపైర్ రహానేకు సూచించాడట. కానీ రహానే మాత్రం అంపైర్ చెప్పింది వినిపించుకోకుండా వెళ్లినట్టు సమాచారం. అది నోబాల్ అని కన్ఫర్మ్ కావడంతో రహానెను తిరిగి పిలిచామని అంపైర్ తెలిపాడు. దీంతో ఈ ముంబై కెప్టెన్ కు అదృష్టం కలిసివచ్చింది. ఇదిలా ఉంటే వచ్చిన ఈ అవకాశాన్ని రహానె సద్వినియోగం చేసుకోలేకపోయాడు.   16 పరుగులు మాత్రమే చేసి కాసేపటికి మళ్లీ అదే బౌలర్ విసిరిన బంతిని మిడాఫ్ లో ఆడి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్యాట్స్ మన్ ఔటైనట్లు పొరపాటు పడి పెవిలియన్ కు వెళితే వెనక్కి పిలిచే అధికారం ఫీల్డ్ అంపైర్లకు ఉందని నిబంధనలు చెబుతున్నాయి.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే స్టార్ ఆటగాళ్లు ఉన్న ముంబై జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. మరో 29 పరుగులు చేస్తే జమ్మూ కాశ్మీర్ విజయం సాధిస్తుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 120 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ 206 పరుగులు చేసి 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. రెండో ఇన్నింగ్స్ లో ముంబై శార్దూల ఠాకూర్ సెంచరీతో 290 పరుగులకు ఆలౌట్ అయింది.