SL vs IND 2024: జడేజాను వన్డేల్లో అందుకే ఎంపిక చేయలేదు: టీమిండియా చీఫ్ సెలక్టర్

SL vs IND 2024: జడేజాను వన్డేల్లో అందుకే ఎంపిక చేయలేదు: టీమిండియా చీఫ్ సెలక్టర్

శ్రీలంకతో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌లకు ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ను గురువారం (జూలై 18) ప్రకటించారు. అయితే ఈ టూర్ లో వన్డే జట్టులో జడేజాకు చోటు దక్కపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది.వరల్డ్ కప్ 2024 తర్వాత జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో, టెస్టుల్లో కొనసాగుతానని చెప్పాడు. భారత జట్టులో దశాబ్ధకాలంగా సీనియర్ ఆల్ రౌండర్ గా జడేజా తనదైన ముద్ర వేశాడు.

వన్డే జట్టులో అతనికి చోటు దక్కడం ఖాయమనుకున్నారు. అయితే ఈ స్పిన్ ఆల్ రౌండర్ కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఆల్ రౌండర్ల కోటాలో వాషింగ్ టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే లను ఎంపిక చేశారు. దీంతో జడేజాకు నిరాశ తప్పలేదు. సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శ్రీలంక సిరీస్ కు ఎంపికయ్యారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకున్నట్టు తేలింది. హార్దిక్ పాండ్య వ్యక్తిగత కారణాల వలన వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే జడేజా విషయంలో క్లారిటీ లేదు. అతనికి రెస్ట్ ఇచ్చారో లేకపోతే జట్టు నుంచి తప్పించారో పెద్ద ప్రశ్నగా మారింది.

ALSO READ | SL vs IND 2024: శ్రీలంక టూర్‌కు సపోర్టింగ్ స్టాఫ్‌ను ప్రకటించిన గంభీర్

కొంతమంది జడేజాను ఉద్దేశ్యపూర్వకంగానే తప్పించారని అంటే.. కొన్ని నివేదికలు జడేజా కెరీర్ ముగిసిందని భావించారు. అయితే జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించలేదని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. "జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరినీ మూడు మ్యాచ్ ల సిరీస్ కు తీసుకోవడం నిజంగా అర్ధం లేనిది. జడేజా టీమిండియాకు చాలా కీలక ఆటగాడు. సమీప భవిష్యత్తులో అతను చాలా టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అతన్ని మేము జట్టు నుంచి తొలగించలేదు. 

భారత్ కు బిజీ షెడ్యూల్ ఉండడం కారణంగా అతనికి రెస్ట్ ఇచ్చాం. అతను ఎప్పుడూ వన్డే ప్రణాళికలో భాగంగా ఉంటాడు. స్క్వాడ్‌ను ప్రకటించినప్పుడు బహుశా మేము దానిని స్పష్టం చేసి ఉండాల్సింది అని అనుకుంటున్నాను". అని అగార్కర్ స్పష్టం చేశారు. శ్రీలంక టూర్ లో జడేజాతో పాటు స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూలై 27 నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్.. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.