Ajit Agarkar: పాండ్య మాకు కీలక ఆటగాడు.. కెప్టెన్సీ నుంచి తొలగించడానికి అదొక్కటే కారణం: అజిత్ అగార్కర్

Ajit Agarkar: పాండ్య మాకు కీలక ఆటగాడు.. కెప్టెన్సీ నుంచి తొలగించడానికి అదొక్కటే కారణం: అజిత్ అగార్కర్

రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటంచడంతో టీమిండియా తదుపరి కెప్టెన్ హార్దిక్ పాండ్య అని అందరూ భావించారు. టీ20 వరల్డ్ కప్ లోనూ హార్దిక్ పాండ్య భారత వైస్ కెప్టెన్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తు టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా  ఉంటాడన్న అంచనాలను తలకిందులు చేస్తూ బీసీసీఐ సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్ తర్వాత హార్దిక్‌ను కాదని సూర్యకు కెప్టెన్సీ అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు. "భారత జట్టుకు హార్దిక్‌ చాలా కీలక ఆటగాడు. ఫిట్‌నెస్ అతనికి సవాలుగా మారింది. అతను ఫిట్ నెస్ సమస్యలకు గురైతే కోచ్, సెలక్టర్లకు కష్టమవుతుంది. హార్దిక్ మరింత మెరుగ్గా ఆడతాడని భావిస్తున్నాం. అతను ప్రపంచ కప్‌లో ఏమి చేసాడో మనం చూశాం. సూర్యకు కెప్టెన్ అయ్యేందుకు అన్ని లక్షణాలు, అర్హతలు ఉన్నాయి". అని అగార్కర్ అన్నారు. మరో నాలుగు రోజుల్లో జరగనున్న శ్రీలంక టీ20 సిరీస్ కు పాండ్య ఎంపికయ్యాడు. వన్డేల్లో మాత్రం వ్యక్తిగత కారణాల వలన తప్పుకున్నాడు.  

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కూడా హార్దిక్‌ పాండ్యా అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా చేసేంత సమర్థుడని పూర్తిగా విశ్వసించలేదని తెలుస్తోంది. ఐపీఎల్‌లో గుజరాత్‌కు కెప్టెన్సీ చేసిన దాని వెనక నెహ్రా, బౌచర్‌ పాత్ర ఉందని కొందరు గుర్తు చేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లోని యువకులు పాండ్యా కంటే సూర్యకు మెరుగ్గా స్పందించే అవకాశం ఉందని కూడా కొందరు భావిస్తున్నారు. దీంతో హార్దిక్ పాండ్య వన్డే, టీ20ల్లో ప్లేయర్ గా భారత జట్టుకు తన సేవలు అందించనున్నాడు.