టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా శుభమాన్ గిల్.. హింట్ ఇచ్చేసిన భారత చీఫ్ సెలక్టర్

టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా శుభమాన్ గిల్.. హింట్ ఇచ్చేసిన భారత చీఫ్ సెలక్టర్

కొన్నేళ్లుగా భారత జట్టుకు చాలామంది కెప్టెన్లు మారారు. ప్రధాన కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో కెప్టెన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు అరడజను భారత జట్టుకు నాయకత్వం వహించారు. హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శుభమాన్ గిల్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరో రెండు, మూడేళ్ళలో వన్డే, టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడం ఖాయం. ఈ నేపథ్యంలో భారత భవిష్యత్తు కెప్టెన్ ఎవరనే విషయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ హింట్ ఇచ్చాడు. 

అద్భుత ప్రతిభ కలిగిన యువ ఆటగాడు శుభమాన్ గిల్ ను భవిష్యత్తు కెప్టెన్ గా కితాబులిచ్చాడు. "గిల్ ఎంతో ప్రతిభ గల ఆటగాడు. అతను మూడు ఫార్మాట్లలో ఆడతాడు. డ్రెస్సింగ్ రూమ్ నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గత సంవత్సరంలో మంచి ఆటను కనబరిచాడు. సూర్య, రోహిత్ వంటి సీనియర్ ఆటగాళ్ల నుండి ఆటలో మెళకువలను నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. తరచూ గాయాల బారిన పడే ఆటగాళ్లను మేము కెప్టెన్ గా కోరుకోవడం లేదు. గిల్ లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతను తన ఆటను కెప్టెన్సీను మెరుగు పరుచుకోవడానికి మేము అతనికి అనుభవాన్ని అందించాలనుకుంటున్నాము.”అని అగార్కర్ అన్నారు.

రెండేళ్ల నుంచి గిల్ తన బ్యాటింగ్ తో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. దీంతో అతన్ని ఇటీవలే ముగిసిన జింబాబ్వే టూర్ కు యువ భారత జట్టుకు కెప్టెన్ గా ప్రకటించారు. ఈ సిరీస్ లో భారత్ 4-1 తేడాతో సిరీస్ గెలిచింది. ఇక తాజాగా శ్రీలంకతో జరగబోయే సిరీస్ కు గిల్ ను టీ20, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. వన్డేల్లో రోహిత్.. టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్ భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.