అప్పుడు బాబాయ్​కి ఓటేశారు.. ఇప్పుడు నాకు వేయండి.. ఓటర్లకు అజిత్ పవార్ విజ్ఞప్తి

అప్పుడు బాబాయ్​కి ఓటేశారు.. ఇప్పుడు నాకు వేయండి.. ఓటర్లకు అజిత్ పవార్ విజ్ఞప్తి

బారామతి: లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కు ఓటేశారని అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తనకు ఓటేయాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కోరారు. బారామతి ప్రజలకు నీటిని అందించడానికి తాను నిబంధనలను కూడా పట్టించుకోలేదని తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం  బారామతి తహసీల్ లోని సవాల్ గ్రామంలో ఆయన ప్రసంగించారు.

‘‘లోక్ సభ ఎన్నికల్లో సుప్రియ ఓడిపోయి ఉంటే ఈ వయసులో శరద్ పవార్ ఎంతగానో బాధపడి ఉండేవారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రియకు మీరు ఓటేశారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నాకు ఓటేయ్యండి. నా స్టైల్ లో తాలూకాను అభివృద్ధి చేసి చూపిస్తాను” అని తెలిపారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంటు నుంచి  శరద్ పవార్ కూతురు  సుప్రియా సూలే పోటీ చేశారు. ఇదే స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బరిలోకి దిగారు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో సుప్రియ విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటనను  అజిత్ పవార్ పరోక్షంగా ప్రస్తావించారు.