- మనుమడి కోసం అంత ప్రేమ ఎలా వచ్చిందో అర్థం కావట్లే
బారామతి: తన చిన్నమ్మ ప్రతిభా పవార్ (ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ భార్య) గతంలో ఎప్పుడూ ప్రచారంలో పాల్గొనలేదని, ఇప్పుడు తన ప్రత్యర్థి యుగేంద్ర పవార్ కోసం ప్రచారం చేస్తున్నారని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. శనివారం బారామతిలోని పన్సార్ వాడి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. అప్పటికపుడే మనుమడిపై తన చిన్నమ్మకు అంత ప్రేమ ఎలా పుట్టిందో తనకు అర్థం కావడం లేదన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రతిభా పవార్ కుటుంబమంతా ప్రచారం చేస్తోందన్నారు. ‘‘1991 నుంచి మీరు (నియోజకవర్గ ప్రజలు) నన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నారు. నా కోసం నా చిన్నమ్మ ప్రతిభా పవార్ ఎప్పుడన్నా ప్రచారం చేశారా? మనుమడిపై అంత సడెన్ గా ఆమెకు ప్రేమ ఎలా పుట్టింది? నాకర్థం కావడం లేదు.
ఎన్నికలు అయిపోయాక చిన్నమ్మను ఈ విషయం అడుగుతా” అని అజిత్ పేర్కొన్నారు. తమ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం 2.3 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమచేసి ఆర్థికసాయం చేసిందన్నారు. కాగా.. బారామతిలో అజిత్ పవార్ పై ఆయన సోదరుడి కొడుకు యుగేంద్ర పవార్ పోటీచేస్తున్నారు.