Pattudala Review: మూవీ రివ్యూ.. యాక్షన్లో పట్టుదల చూపించిన అజిత్ కుమార్

Pattudala Review: మూవీ రివ్యూ.. యాక్షన్లో పట్టుదల చూపించిన అజిత్ కుమార్

స్టార్ హీరో అజిత్, హీరోయిన్ త్రిష జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పట్టుదల. తమిళంలో విదామయూర్చి. ఈ మూవీ నేడు గురువారం (ఫిబ్రవరి 6న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాలీవుడ్ మూవీ బ్రేక్‌డౌన్ ఆధారంగా పట్టుదల మూవీ రూపొందింది.

మ‌‌గిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. టీజర్, ట్రైలర్ విజువల్స్తో ఆడియన్స్ను మెప్పించిన పట్టుదల థియేటర్స్లో ఎలా ఉంది? అజిత్కు తెలుగులో బ్రేక్ ఇచ్చేనా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే:

ప్రేమించి పెళ్లి చేసుకున్న రొమాంటిక్ కపుల్‌ 12 ఏళ్ల కాపురం తర్వాత విడిపోవాలని అనుకుంటారు. దీంతో కయల్ (త్రిష)ని తన సొంతింట్లో దింపి రావాలని బయలుదేరతాడు అర్జున్ (అజిత్). అదే తమ చివరి ప్రయాణం అవుతుందని భావించిన అర్జున్ స్వయంగా దగ్గరుండి దిగబెట్టి వస్తానని కారులో ప్రయాణం సాగిస్తారు. అయితే మార్గమధ్యంలో అర్జున్ కారు చెడిపోతుంది.

ఈ క్రమంలో వాళ్లకు రక్షిత్ (అర్జున్), దీపికా (రెజీనా) పరిచయం అవుతారు. రక్షిత్ అండ్ దీపికా ప్రయాణిస్తున్న ట్రక్ లో కయల్ వెళుతుంది. ఆ తర్వాత వచ్చే ఓ కేఫ్ దగ్గర ఆగి కార్ రిపేర్ కి లేదా ఏదైనా ట్రక్ పంపిస్తాను అని చెప్పి రక్షిత్ కారులో వెళ్తుంది. భార్యను వాళ్లతో పంపించాక.. అనూహ్యంగా అర్జున్ కి కొన్ని అనుమానాలు వస్తాయి. అతని కారులో వైర్లను ఎవరో కట్ చేసి కావాలని పాడయ్యేలా చేసారనే సంగతి గుర్తిస్తాడు. అలా తనకి తానుగా కారు బాగు చేసుకుని ముందున్న కేఫ్ కి వెళ్లి చూస్తే అతని భార్య కయల్ కనిపించదు.

ALSO READ | Thaman: మరోసారి మంచి మనసు చాటుకున్న తమన్.. భాదితులకోసం ఫ్రీగా మ్యూజికల్ నైట్..

ఆ తర్వాత ఆమె ఆచూకీ కోసం వెతకగా ఎక్కడ కనిపించకపోవడంతో కిడ్నాప్ జరిగినట్టు గుర్తిస్తాడు. ఇక ఆ కిడ్నాపర్ల నుంచి తన భార్యను అర్జున్ విడిపించుకున్నాడా? అసలు ఆ కిడ్నాపర్లు ఎందుకు కయల్ ను టార్గెట్ చేస్తారు? ఈ నలుగురి మధ్య జరిగిన డ్రామా ఏంటీ? తిరిగి ఆమెను అర్జున్ ఎలా రక్షించుకున్నాడు? అర్జున్ అజ‌ర్‌బైజాన్ ఎందుకు వెళ్లాడు? అర్జున్‌కు విడాకులు ఇవ్వాల‌ని క‌య‌ల్ ఎందుకు అనుకున్న‌ది? అనేది పట్టుదల కథ.

ఎలా ఉందంటే:

హీరో అజిత్ కుమార్ కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇన్నేళ్లకు వారి ఆశలకు పులిష్టాప్ పడింది. అందుకు తగ్గట్టుగానే పట్టుదల మూవీ కథనం సాగింది.

అజిత్ సినిమా అంటేనే భారీ ఫైట్లు, స్టైలిష్ ఛేజింగ్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు డోకా ఉండ‌ద‌ని కామన్ సినీ ఆడియన్ అనుకుంటాడు.  స్క్రీన్ ప్ర‌జెన్స్, క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ హాలీవుడ్ లెవెల్‌ విజువల్స్‌తో సినిమాని తారాస్థాయికి తీసుకొచ్చాడు.

సినిమా స్టార్ట్ ఐనా ఫస్ట్ 20 నిముషాలు స్లో పేజ్ స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చే సీన్స్ ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. ఫస్టాఫ్ లవ్ సీన్స్, సెకండాఫ్ యాక్షన్స్ సీన్స్ తో సినిమా అదిరిపోయింది. ఫస్టాఫ్ గురించి ఒక్కమాటలో చెప్పుకోవాలంటే.. అర్జున్-కయల్ పరిచయం, ప్రేమ, డైవర్స్ చూపించి కారు ప్రయాణంతో సినిమా సాగుతుంది. ఆ తర్వాత కయల్ మిస్ అవ్వడం, అర్జున్ వెతకడం, అలా ఓ మిస్టరీ మెన్ ఎంట్రీతో ఇంటర్వెల్ కి ట్విస్ట్ రావడంతో ఫస్టాఫ్ ఉంటుంది.

అయితే, కథ చిన్నదని అనిపించవచ్చు. కానీ, ఇక్కడ దర్శకుడు రాసుకున్న కథకు జోడించిన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసేశాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం అజిత్ చాలా రిస్క్ తీసుకుని, సొంతంగా స్టంట్స్ చేశాడు అజిత్ కుమార్. ఇవి కేవలం అజిత్ ఫ్యాన్స్ కి మాత్రమే సగటు సినిమా అభిమానికి కూడా హై ఇస్తాయి. ఇక సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ సినిమాను ముగించడం ఆడియన్ కి మంచి ఫీల్ ఇస్తోంది. 

ఎవరెలా చేశారంటే:

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో అజిత్ స్క్రీన్ ప్ర‌జెన్స్, క్యారెక్ట‌రైజేష‌న్ అదిరింది. ముఖ్యంగా ఈ సినిమాలో అజిత్ కు యాక్షన్స్ తో పాటు ఎమోషన్స్ లో నటించే అవకాశం దొరికింది. భార్య దూర‌మైనపుడు ప‌డే బాధ‌, ఆమె ప్రేమ కోసం ప‌రిత‌పించే సీన్స్‌లో మెప్పిస్తాడు.

త్రిష ఎప్పటిలాగే తన అందంతో పాటు నటనతో గుర్తుండిపోయేలా చేసింది. విలన్ గా నటించిన అర్జున్ ఈ సినిమాలో భారీ హైప్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా అజిత్, అర్జున్ మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్, ట్రైన్ ఎపిసోడ్ లో ఇద్దరు చెలరేగిపోయారు. రెజీనా పర్వాలేదనిపించింది.

సాంకేతిక అంశాలు:

సినిమాటోగ్రఫీ ఓం ప్రకాశ్ విజువల్స్ ఈ సినిమాను ప్రాణం పోశాయి. యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుచేసేలా చేశాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన బీజీఎమ్‌తో సినిమాకు హై యాక్ష‌న్ ఫీల్‌ను తీసుకొచ్చాడు. శ్రీకాంత్ ఎడిటింగ్ బాగుంది.

డైరెక్టర్ మ‌‌గిళ్ తిరుమేని తాను రాసుకున్న క‌థ‌లోని లోపాల‌ను వెతుక్కునే టైమ్ కూడా ఆడియెన్స్ కు ఇవ్వలేదు. తనదైన స్క్రీన్ ప్లే తో మెప్పించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులతో నడిపించిన విధానం ఆడియన్స్ ను సీట్ లో కూర్చోబెట్టడంలో విజయం సాధించాడు.లైకా ప్రొడక్షన్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.