బీజేపీలోకి అజ్మీరా ప్రహ్లాద్​

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు:  రాష్ట్ర మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌‌‌‌ కొడుకు ప్రహ్లాద్‌‌‌‌ త్వరలోనే బీజేపీలో  చేరనున్నారు. ఈ నెల 15 లేదా 16న తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌‌‌‌ రెడ్డి ఆధ్వర్యంలో  బీజేపీలో చేరతానని ప్రహ్లాద్‌‌‌‌ స్వయంగా  ప్రకటించారు. ఇప్పటికే దీనిపై  ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని తన కార్యకర్తలతో సమాలోచనలు చేసినట్లు వివరించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకి చెందిన అజ్మీరా ప్రహ్లాద్‌‌‌‌ తండ్రి చందూలాల్‌‌‌‌కు 37 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేసిన ఆయన..2021 ఏప్రిల్‌‌‌‌ లో  కన్నుమూశారు. 

తండ్రి మరణం తరువాత తనకు ములుగు టికెట్ వస్తుందని అనుకున్న ప్రహ్లాద్‌‌ కు నిరాశ ఎదురైంది. ఆ టికెట్ బడే నాగజ్యోతికి ఇవ్వడంతో ఆయన  పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేయాలనే సంకల్పంతో తన కార్యకార్తలతో ఇప్పటికే సమాలోచనలు చేశారు. ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన తాను బీజేపీ నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలుస్తానని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌‌‌‌లో కిషన్‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమంలో 2 వేల మంది పాల్గొంటారని..150 వెహికల్స్‌‌‌‌ సిద్ధం చేసుకున్నట్లుగా ప్రహ్లాద్‌‌‌‌ 'వీ6 వెలుగు'తో  చెప్పారు.