యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో జట్కా మటన్ విక్రయానికి అనుమతి ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాదగిరిగుట్టలో హలాల్ మాంసాన్ని మాత్రమే విక్రయిస్తుండడంతో హిందువులు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు.
స్థానిక ప్రజలతో పాటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల్లో చాలా మంది హిందువులు హలాల్ చేయని మాంసం కోరుకుంటున్నారన్నారు. కొండ కింద మొక్కులు చెల్లించే జంతుబలి విషయంలో హలాల్ తప్పనిసరనే నియమం సరికాదన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పట్టణంలో జట్కా మాంసం విక్రయ దుకాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.