డేరాబాబాకు హెల్ప్ చేసినందుకు టాయిలెట్లు క్లీన్ చెయ్..మాజీ డిప్యూటీ సీఎంకు శిక్ష

డేరాబాబాకు హెల్ప్ చేసినందుకు టాయిలెట్లు క్లీన్ చెయ్..మాజీ డిప్యూటీ సీఎంకు శిక్ష

చండీగఢ్: సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్  సాహిబ్  అపవిత్రం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్  గుర్మీత్  రామ్  రహీంకు సాయం చేసినందుకు టాయిలెట్లు శుభ్రం చేయాలని పంజాబ్  మాజీ డిప్యూటీ సీఎం సుఖ్ బిర్  సింగ్  బాదల్ కు సిక్కుల అత్యున్నత అకల్  తఖ్త్  శిక్ష వేసింది. అమృత్ సర్ లోని గోల్డెన్  టెంపుల్ తో పాటు గురుద్వారాలోని బాత్ రూంలు, కిచెన్లను కూడా క్లీన్  చేయాలని ఆదేశించింది. అలాగే.. సుఖ్ బిర్  తండ్రి, పంజాబ్  మాజీ సీఎం ప్రకాశ్  సింగ్  బాదల్ కు 2011లో ఇచ్చిన ‘ఫఖ్రే క్వామ్’ బిరుదును కూడా  తొలగించింది. సుఖ్ బిర్  బాదల్, అకాలీ దళ్  కోర్  కమిటీ మెంబర్లు, లీడర్లు.. అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో ఈనెల 3న మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు బాత్ రూంలను క్లీన్  చేస్తారని అకల్ తఖ్త్  తెలిపింది. 

అంతకుముందు సుఖ్ బిర్  సింగ్  తన తప్పులను ఒప్పుకుంటూ అకల్ తఖ్త్ కు బేషరతుగా క్షమాపణ చెప్పారు. సుఖ్ బిర్  తప్పుడు ప్రవర్తనకు శిరోమణి అకాలీ దళ్  (ఎస్ఏడీ) పార్టీ చీఫ్​గా ఆయన రాజీనామాను ఆమోదించాలని, ఆరు నెలల్లో పార్టీని పునర్వ్యవస్థీకరించాలని ఎస్ఏడీ వర్కింగ్  కమిటీని కూడా అకల్ తఖ్త్  ఆదేశించింది. కాగా.. 2015లో డేరా సచ్చా సౌదా చీఫ్  గుర్మీత్  రామ్  రహీం.. గురుగ్రంథ్  సాహిబ్ ను అపవిత్రం చేశారు. 2007లో కూడా సిక్కు గురువుల్లాగా డ్రస్  వేసుకున్నందుకు అతడిని అకల్ తఖ్త్  బహిష్కరించింది.