సుఖ్​బీర్ సింగ్​పై హత్యాయత్నం..గోల్డెన్ టెంపుల్ ముందే కాల్పులు

సుఖ్​బీర్ సింగ్​పై హత్యాయత్నం..గోల్డెన్ టెంపుల్ ముందే కాల్పులు

 

  • సేవాదార్​గా శిక్ష అనుభవిస్తున్న టైమ్​లోనే ఘటన
  • అడ్డుకున్న పోలీసులు.. తప్పిన ప్రమాదం
  • నిందితుడు మాజీ టెర్రరిస్ట్​గా గుర్తింపు
  • ఖలిస్థానీ మిలిటెంట్లతో సంబంధాలు

అమృత్​సర్: శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్​బీర్ సింగ్ బాదల్​పై ఓ మాజీ టెర్రరిస్ట్ కాల్పులు జరిపాడు. బాదల్​కు సమీపంలోకి వెళ్లి కాల్పులకు ప్రయత్నించగా.. పక్కనున్న వాళ్లు అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బుధవారం ఉదయం 9.30 గంటలకు గోల్డెన్ టెంపుల్ గేటు ముందు జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారంలో ఉన్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌.. మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారించిన అకాల్ తఖ్త్.. బాదల్​ను దోషిగా తేల్చి శిక్ష విధించింది. కాలు ఫ్రాక్చర్ కావడంతో పట్టీ కట్టుకున్న బాదల్ చక్రాల కుర్చీలో కూర్చుని టెంపుల్ ద్వారం వద్ద కాపలాదారుగా సేవ చేశారు. ఆ టైమ్​లోనే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాగా, నిందితుడిని నరైన్‌ సింగ్‌ చౌరాగా గుర్తించారు.

టెంపుల్ గోడను తాకిన బుల్లెట్

డేరాబాబా నానక్​కు చెందిన నరైన్ సింగ్ చౌరా.. రెండు చేతులు జోడించి మెల్లిగా సుఖ్​బీర్ సింగ్ బాదల్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. కొన్ని అడుగుల దూరంలో ఉండగానే ప్యాంటు జేబులోంచి గన్ తీసి బాదల్​పై గురిపెట్టాడు. అతని పక్కనే మఫ్టీలో ఉన్న ఏఎస్ఐ.. నరైన్​సింగ్ వైపు పరుగెత్తుకెళ్లి గన్​ను పట్టుకున్నాడు. అయినప్పటికీ నరైన్ సింగ్ ఓ తూటా గాల్లో పేల్చగా.. అది టెంపుల్ గోడను తాకింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్​జీపీసీ) టాస్క్ ఫోర్స్ సభ్యులు గన్ లాక్కొని చౌరాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుఖ్‌బీర్‌కు ఎలాంటి హానీ జరగలేదు. విషయం తెలిసిన వెంటనే బాదల్ సతీమణి, భటిండా ఎంపీ హర్​సిమ్రత్ కౌర్ గోల్డెన్ టెంపుల్ చేరుకుని భర్తను పరామర్శించింది. 

ఎవరీ నిందితుడు నరైన్ సింగ్ చౌరా?

నరైన్ సింగ్ చౌరా.. ఓ మాజీ టెర్రరిస్ట్. క్రిమినల్ హిస్టరీ ఉంది. అతడిపై 20కు పైగా కేసులున్నాయి. ఖలిస్థానీ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయి. బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్​లో నరైన్ పని చేశాడు.