యాదిలో: ఆధునిక హైదరాబాద్​ నిర్మాత.. సర్​ అక్బర్ హైదరీ

యాదిలో: ఆధునిక హైదరాబాద్​ నిర్మాత..  సర్​ అక్బర్ హైదరీ

హైదరీ 1893లో అమీనా త్యాబ్జీని పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ‘పర్దా’(బుర్ఖా) పద్ధతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. హైదరీ ప్రోత్సాహంతో అమీనా బుర్ఖా లేకుండానే బొంబాయిలో తిరిగింది. అక్కడ బుర్ఖా లేకుండా కనిపించిన మొదటి ముస్లిం ఆమే. ‘‘ఒక దేశంలో స్త్రీలు అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతుంటే అది విద్యావంతమైన, అభివృద్ధి చెందిన దేశం కానేరదు” అంటాడు హైదరీ.

మొహమ్మద్ అక్బర్ నజర్ అలీ హైదరీ.. బొంబాయిలో సంపన్న కుటుంబంలో పుట్టాడు. వాళ్లది ‘జమాత్ సులే-మాని’ (బోహ్రా) అనే ముస్లిం తెగ. ఆయన బొంబాయిలోని సెయింట్ జేవియర్ జెసూట్ కాలేజీలో చదువుకున్నాడు. ఇంగ్లీష్​, సాహిత్యం, ఆర్థికశాస్త్రం, లాటిన్, చరిత్రలతో పాటు ‘లా’ మీద కూడా విస్తృతంగా అధ్యయనం చేశాడు. తర్వాత బద్రుద్దీన్ త్యాబ్జీని ఆదర్శంగా తీసుకుని (అప్పట్లో ఆయన జడ్జీగా ప్రసిద్దికెక్కాడు) తాను కూడా న్యాయవాద వృత్తిలోకి వెళ్లాలి అనుకున్నాడు.

 కానీ.. వాళ్ల కుటుంబీకులు మాత్రం హైదరీని ఫైనాన్షియల్ సర్వీస్​లో చేరమన్నారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితిలో 1888లో ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్​లో చేరాడు. 1903లో ‘కంట్రోలర్ ఆఫ్ సెంట్రల్ ట్రెజరీస్​’ అయ్యాడు. 1890లో ‘అసిస్టెంట్ అకౌంటెంట్​ జనరల్’, 1900లో మద్రాస్​లో ‘డిప్యూటీ అకౌంటెంట్ జనరల్​’గా (ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయుడు), 1901లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ అకౌంట్స్ ఎగ్జామినర్​గా చేశాడు. ఆ తర్వాత 1905లో హైదరాబాద్ సంస్థానం సర్వీస్​లో చేరాడు. ఆయన పనిచేసిన ప్రతి చోటా తనను తాను సమర్థతగల అధికారిగా నిరూపించుకున్నాడు. అందుకే అన్ని పదవులు దక్కాయి. 

హైదరీ హైదరాబాద్​ స్టేట్ ఎగ్జిక్యూటివ్​ ఫైనాన్స్, రైల్వే మెంబర్​గా ఎంతో ఖ్యాతి సంపాదించాడు. 1905 నుంచి 1920 వరకు హైదరాబాద్​ స్టేట్​లోనే పనిచేశాడు. మొదట పైనాన్షియల్ సెక్రటరీగా సేవలందించాడు. 1907 నుంచి హోం డిపార్ట్‌‌‌‌మెంట్  సెక్రటరీగా పనిచేసి రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి కృషి చేశాడు. సంపద సులభంగా ప్రవహించేలా కొత్త చానెళ్లు తెరిచాడు. అప్పుడప్పుడు దక్కన్​ను క్షామం ముంచెత్తేది. అలాంటి పరిస్థితులను తట్టుకునేందుకు హైదరీ ప్రత్యేకంగా రిజర్వ్‌‌‌‌ ఫండ్​ని ఏర్పాటు చేశాడు. అది తర్వాతి కాలంలో ఉపయోగపడింది. 

హైదరాబాద్​లో అక్బర్​ హైదరీ ఆర్థిక నిపుణుడిగా కూడా పేరుపొందాడు. హోం డిపార్ట్‌‌‌‌మెంట్​ ఇన్​చార్జిగా ఉన్నప్పుడు సంస్థానాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశాడు. రాష్ట్రంలో ఆర్కియాలాజికల్ డిపార్ట్‌‌‌‌మెంట్ నెలకొల్పడానికి కారకుడు ఆయనే. రాష్ట్ర సరిహద్దుల దగ్గర 6 ఎల్లోరా గుహలు, దౌలతాబాద్ కోట దుర్గం శిథిలాలు, బీదర్, గుల్బర్గాలోని శిల్పకళా సంపదలు, బహుమనీలతో పాటు ఇతర రాజ వంశాలకు చెందిన చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఎంతోకాలం నుంచి నిర్లక్ష్యం చేశారు. 

హైదరీ వాటి పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని జాగ్రత్త చేయించాడు. ఆ టైంలోనే ఆయనకు విశ్వవిద్యాలయం నెలకొల్పాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వల్లే ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది. ఆయన కీర్తి కిరీటంలో అదొక కలికితురాయి. ఆయన హైదరాబాద్​లో ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు ఎన్నో సత్ఫలితాలను ఇచ్చాయి. రాష్ట్ర  ఖజానా రాబడి పెరిగింది. భారీ నీటిపారుదల సమస్య, క్షామ నివారణ లాంటి పథకాలను భరించగలిగే స్థాయికి ఖజానా చేరింది. లోన్లు సంపాదించగలిగింది. 1930లో 1200 మైళ్ళ రైల్వేను కొనుగోలు చేయగలిగే శక్తిగా మారింది. హైదరాబాద్​ గవర్నమెంట్​– ఇండియా మధ్య ఉన్న బీరార్​ సమస్య కూడా హైదరీ చొరవతోనే పరిష్కారమైంది. అంతలా మార్పు తీసుకొచ్చినందుకు మెచ్చి హైదరీకి 1928లో  ‘నైట్​ హుడ్​’ అవార్డు కూడా ఇచ్చారు.

ఆ తర్వాత 1936లో ఆయన ‘ప్రీవీ కౌన్సెలర్’అయ్యాడు. ఆయన తీర్పులను అందరూ గౌరవించేవాళ్లు. ఆయన కేవలం తన రాష్ట్ర సంక్షేమాన్ని మాత్రమే కాకుండా అఖండ భారత దేశ సంక్షేమాన్ని కాంక్షించేవాడు. ఈ ఒక్క కారణం వల్లే హైదరీని ప్రసిద్ధ భారతీయుల్లో చేర్చవచ్చు.

- మేకల 
మదన్​మోహన్​ రావు
రిటైర్డ్​ హెడ్​ మాస్టర్