
- రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటం.. కానీ, మా సమస్యలు పరిష్కరించాలి: అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని లూటీ చేసిన గత పాలకులు మళ్లీ పీఠమెక్కకుండా చూస్తామని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని.. కానీ, తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. మహవీర్ జయంతికి ప్రభుత్వ సెలవు ఇవ్వాలని, సిటీలో అతిపెద్ద గుడి అయిన లాల్‌దర్వాజ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. హిందూత్వం, సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్లు ఏనాడూ దాని గురించి పట్టించుకోలేదన్నారు.
హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వాళ్లు ఏనాడూ ఎండోమెంట్ ల్యాండ్స్ గానీ.. హిందువుల కోసం గానీ కొట్లాడలేదన్నారు. తాము కేవలం ముస్లింల కోసమే పనిచేయమని, హిందువుల కోసం కూడా పోరాడుతామని అక్బరుద్దీన్స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మైనారిటీ రెసిడెన్షియల్స్కూళ్లకు సంబంధించి తొమ్మిది నెలలుగా కిరాయి కట్టలేదని, మూడు నెలల బకాయిలైనా చెల్లించాలన్నారు.
డ్రగ్స్ కట్టడికి పోలీస్ ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలి
డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు స్లమ్ ఏరియాల్లో పోలీస్ ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ కోరారు. ఈ సమస్య పేదలు ఎక్కువగా ఉండే బస్తీల్లోనే ఉందన్నారు. స్కూళ్ల పక్కన ఉండే పాన్షాపుల్లోనూ గంజాయి విక్రయాలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలన్నారు. స్కాలర్షిప్పుల్లో కొన్ని మార్పులు చేయాలని అక్బరుద్దీన్ సూచించారు. కొన్ని కోర్సుల్లో విద్యార్థులు ఓ వైపు ఫీజు రీయింబర్స్మెంట్తీసుకుంటూనే.. నెలనెలా స్టైపెండ్ పొందుతున్నారని, ఈ రెండు కలిపితే లక్షల్లో అవుతుందని చెప్పారు. ఇలాంటి వాటిని మార్చాలన్నారు.