
- అందుకే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతున్నది: అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, వెలుగు: పోలీసులు డ్యూటీలు పక్కనపెట్టి ల్యాండ్ సెటిల్ మెంట్లు చేస్తున్నరని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అందువల్లే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతోందని, గతంతో పోలిస్తే 4.4 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లలో క్రైమ్ నియంత్రణపై పని జరగడం లేదని, అక్కడ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు.
పిల్లలపై నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. సభ నాలుగు రోజులు నిర్వహిస్తే 38 డిమాండ్లపై చర్చ ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. బడ్జెట్ పై చర్చించేందుకు కనీసం 10 రోజులైనా సభ నిర్వహించాలని కోరారు. బుధవారం అక్బరుద్దీన్ ఒవైసీ పద్దులపై అసెంబ్లీలో మాట్లాడారు." సిటీలో ఒవైసీ హాస్పిటల్నుంచి డీఆర్డీవో స్ట్రెచ్‌లో ఒక నెలలో 17 యాక్సిడెంట్లు జరిగి 17 మంది చనిపోయారు. డ్రంకెన్అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు. శని, ఆదివారాలు వచ్చాయంటే బ్రీత్ అనలైజర్స్తో టెస్టులు చేస్తున్నారు. కానీ, మానిటరింగ్ లేదు.
ముందు ట్రాఫిక్ పోలీసుల నుంచి కెమెరాలను వెనక్కి తీసుకోవాలి. వారికి కేవలం ట్రాఫిక్‌ను కంట్రోల్‌చేసే పనిని మాత్రమే అప్పగించండి. వాళ్లు ట్రాఫిక్ నియంత్రణను పక్కనపెట్టి ఫొటోలు కొడుతున్నారు. చలాన్లు వేసే హక్కు ట్రాఫిక్ పోలీసులకు ఎక్కడిది?" అని ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్ నిలదీశారు. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ పడిపోవడంతో బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వానికి మాత్రం అవేమీ పట్టట్లేదని మండిపడ్డారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ పట్టుకుతిరుగుతున్నారని ఆరోపించారు.