సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో.. అప్పటికే అజంగఢ్ ఎంపీగా ఉన్న ఆయన రెండింటిలో ఒక పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి.. యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికే సిద్ధపడ్డారు. ఇవాళ ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించారు. దీంతో లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీల బలం నాలుగుకు తగ్గిపోయింది.
2027 ఎన్నికలే టార్గెట్..?
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం 7 దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అఖిలేశ్ యాదవ్ పార్టీనే ప్రధాన పోటీదారుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 255 చోట్ల గెలిచి రెండోసారి యోగి అధికారంలోకి రాగా.. 111 స్థానాలను సొంతం చేసుకుని సమాజ్ వాదీ పార్టీ రెండో పెద్ద పార్టీగా ఏర్పడింది. 2017 ఎన్నికల్లో కేవలం 47 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన సమాజ్ వాదీ ఈసారి తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీగా ఉన్న బీఎస్పీ కేవలం ఒక్క సీటుకు పడిపోయింది. ఈ క్రమంలో 2027 ఎన్నికల్లో ఎలాగైనా యూపీలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేసేందుకే అఖిలేశ్ ఈ దఫా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కీలక పాత్ర పోషించాలని భావించి ఎంపీ పదవిని వదులుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.