మహా కుంభమేళాను పొడిగించాలా.. యూపీ సర్కార్‎కు మాజీ CM రిక్వెస్ట్ ఎందుకు..?

మహా కుంభమేళాను పొడిగించాలా.. యూపీ సర్కార్‎కు మాజీ CM రిక్వెస్ట్ ఎందుకు..?

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్‎లో జరుగుతోన్న మహా కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వాన్ని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కోరారు. 2025, జనవరి 13న మొదలైన మహాకుంభ్ 2025, ఫిబ్రవరి 26వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. మరో 11 రోజుల్లో కుంభమేళా ముగియున్న నేపథ్యంలో.. భక్తుల అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని మహా కుంభ్‎ను మరికొన్ని రోజులు ఎక్స్‎టెండ్ చేయాలని యూపీ ప్రభుత్వాన్ని శనివారం (ఫిబ్రవరి 15) అఖిలేష్  యాదవ్ రిక్వెస్ట్ చేశారు. 

గతంలో కుంభమేళా 75 రోజుల పాటు నిర్వహించేందని.. కానీ ఈ సారి మహా కుంభ్ వ్యవధి తక్కువగా ఉందని.. దీంతో భక్తులు రాలేకపోతున్నారని తెలిపారు. ‘‘ఇప్పటికీ చాలా మంది భక్తులు మహా కుంభమేళాకు వెళ్లాలని కోరుకుంటున్నారు కానీ వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం మహా కుంభమేళా సమయ పరిమితిని పొడిగించాలి’’ అని అఖిలేష్ పేర్కొన్నారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అఖిలేష్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. యూపీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే కుంభమేళా తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందారని ఆరోపించారు.

ALSO READ | వాట్ ఏ థాట్.. వాట్ ఏ విజన్..: కుంభమేళా పోస్టర్ చూసి పిచ్చోళ్లైపోయారు..!

 తొక్కి సలాటలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. ప్రభుత్వం మాత్రం పరువు పోతుందనే భయంతో మరణాల సంఖ్యను తక్కువగా చూపించిందని అన్నారు. ప్రభుత్వం చెప్పిన 30 కంటే తొక్కి సలాటలో జరిగిన మరణాల సంఖ్య చాలా ఎక్కువ అని ఆరోపణలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా నిలిచిన మహా కుంభమేళాకు శుక్రవారం (ఫిబ్రవరి 14)తో 50 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. పవిత్ర త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రానికి 50 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తెలిపింది.