సమాజ్​వాదికి మళ్లీ ఊపిరి

కాలం కలిసిరాకపోతే కర్రే పామై కరుస్తుందట. బీఎస్పీ చీఫ్​ మాయావతికి ఇప్పుడు ఇదే అనుభవం ఎదురైంది. యూపీలో రాజకీయంగా ఆమెకు బ్యాడ్​ టైమ్ నడుస్తూనే ఉంది. అఖిలేశ్​ యాదవ్ ఆధ్వర్యంలోని ఎస్పీని లోక్​సభ ఎన్నికల తర్వాత కరివేపాకులా తీసిపారేసిన ఆమెకు బైఎలక్షన్​లో ఓటర్లు ఓ రేంజ్​లో షాక్​ ఇచ్చారు. ఆ పార్టీతో పొత్తు వద్దనుకున్నందుకు బెహన్​జీ తగిన మూల్యమే చెల్లించుకున్నారు. ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎస్పీ మూడు చోట్ల గెలవగా బీఎస్పీ అసలు ఖాతాయే తెరవలేకపోయింది.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు​ పెద్ద ఊరటనిచ్చాయి. అలాగే ఉత్తరప్రదేశ్​ బైఎలక్షన్​ రిజల్ట్​​​ కూడా సమాజ్​వాదీ పార్టీలో ఉత్సాహం నింపింది. ఆ రాష్ట్రంలో 11 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 8 సీట్లను అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. మిగతా మూడు సెగ్మెంట్లలో ఎస్పీ గెలిచింది. ఆ ఎనిమిది చోట్ల సైతం ఎస్పీ.. బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. ముఖ్య విషయం ఏంటంటే బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు లేకుండా ఎస్పీ ఒంటరిగా పోటీచేసి విజయం సాధించింది.

ఈ ఏడాది ఎండాకాలం​లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో యూపీ​లో అఖిలేష్​ యాదవ్​ నాయకత్వంలోని ఎస్పీ, మాయావతి లీడర్​షిప్​లోని బీఎస్పీ.. గ్రాండ్​ అలయెన్స్​ కట్టి బరిలో నిలిచాయి. ఆ ఎలక్షన్​లో బీఎస్పీ 10 నియోజకవర్గాల్లో గెలుపొందగా ఎస్పీ 5 స్థానాల్లోనే సక్సెస్​ను​ సొంతం చేసుకుంది. దీంతో జనరల్​ ఎలక్షన్​లో ఎస్పీ సరిగా సత్తా చాటలేకపోయిందనే సాకు చూపి బీఎస్పీ ఆ పార్టీతో పొత్తుకు గుడ్​బై చెప్పింది. బైఎలక్షన్​లో సోలో​గానే రంగంలోకి దిగుతామని మాయావతి అప్పుడే తేల్చిచెప్పారు.

కొద్దికాలంలోనే కనుమరుగు

ఐదు నెలల తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికల్లో అదే బీఎస్పీకి ఒక్క సీటూ రాలేదు. లోక్​సభ ఎన్నికల్లో గ్రాండ్​ అలయెన్స్​ భారీ విజయం సాధిస్తుందన్న రాజకీయ పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో కూటమి ఓటమికి బీఎస్పీ ప్రెసిడెంట్​ మాయావతి ఎస్పీని తప్పుపట్టారు. అప్పుడు ఆమె చేసిన కామెంట్స్​పై ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ మారు మాట్లాడకుండా తన పనేదో తాను చేసుకుపోయారు. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. విమర్శలపై స్పందించకుండా పార్టీని బలోపేతం చేయటంపైనే దృష్టి పెట్టారు.

ఒకే ఒక ర్యాలీతో ఓటర్లను గెలిచారు

బైఎలక్షన్​ సందర్భంగా ఒకే ఒక ర్యాలీలో(అదీ ఎస్పీకి కంచుకోట లాంటి రాంపూర్​ సెగ్మెంట్​లో) పాల్గొన్నారు. ఆయన పార్టీ ఈ సీటుతోపాటు తమకు పట్టున్న జైద్​పూర్, జలాల్​పూర్​లలోనూ పైచేయి సాధించింది. అంబేద్కర్​నగర్​ జిల్లాలోని జలాల్​పూర్​లో పోటీ ఆసక్తికరంగా సాగింది. ఇది బీఎస్పీకి సిట్టింగ్​ స్థానం. ఎమ్మెల్యే రితేశ్​ పాండే లోక్​సభకు ఎన్నికవటంతో ఖాళీ అయింది. ఉప ఎన్నికలో బీఎస్పీ, బీజేపీ మధ్యే అసలు పోటీ నెలకొంది. కానీ ఓట్ల కౌంటింగ్​ చివరి రౌండ్లకు వచ్చేసరికి ఎస్పీ అభ్యర్థి ఊహించనివిధంగా గెలిచాడు.

సీట్లు, ఓట్లలో సెకండ్​ ర్యాంక్​ ఎస్పీదే

బైఎలక్షన్​లో యోగి పాలనకు పరీక్ష ఎదురైంది.బీజేపీ 8 స్థానాల్ని దక్కించుకుంటే ఐదు చోట్ల గెలిచి ఎస్పీ  సెకండ్​ ప్లేస్​లో నిలిచింది. బీఎస్పీ, కాంగ్రెస్​ పార్టీలు 3, 4 స్థానాలకే పరిమితమయ్యాయి. ఈ పార్టీలు చెరో రెండు ప్రాంతాల్లో రెండో స్థానం పొందగలిగాయి. అధికార పార్టీ 35.64 శాతం ఓట్లు పొందగా ఎస్పీకి 22.61 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతంలో కూడా బీఎస్పీ, కాంగ్రెస్​ వెనకబడ్డాయి. బీఎస్పీకి 17.02 శాతం, కాంగ్రెస్​కి 11.49 శాతం ఓట్లే వచ్చాయి. లేటెస్ట్​ ఉప ఎన్నికల్లో  అధికార బీజేపీ ఖాతాలో  లక్నో కంటోన్మెంట్, గోవింద్​ నగర్, గ్యాంగో, ఘోసి, ప్రతాప్​ఘర్, బల్హా, ఇగ్లాస్, మాణిక్​పూర్​ నియోజకవర్గాలు పడ్డాయి.

బీజేపీని ఢీకొట్టగలిగేది మేమే

బైఎలక్షన్​లో బీఎస్పీతో పొత్తు లేకుండా సింగిల్​గా పోటీచేయటం మాకే మంచిదైంది. యూపీ ప్రజలు ఇప్పటికీ మా నేత అఖిలేష్ యాదవ్​ని అభిమానిస్తున్నారనటానికి ఈ ఎన్నికల ఫలితాలే రుజువు. రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిన కృషిని జనం మర్చిపోలేదు. ఓట్ల రూపంలో చూపించారు. ఉప ఎన్నికల్లో మూడు సీట్లు సాధించి మేమేంటో నిరూపించుకు న్నాం. ఇక, యూపీలో బీజేపీని ఢీకొట్టగలిగేది మేమే. అసెంబ్లీలో అసలైన ప్రతిపక్షం మా పార్టీయే.  – జుహీ సింగ్​, ఎస్పీ లీడర్​  ​