కుంభమేళాలో ఎంతమంది చనిపోయారో నిజం చెప్పండి: అఖిలేష్

కుంభమేళాలో ఎంతమంది చనిపోయారో నిజం చెప్పండి: అఖిలేష్

న్యూఢిల్లీ: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 4) లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా కుంభమేళా తొక్కిసలాటలో చోటు చేసుకున్న మరణాల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాచి పెడుతోందని.. అసలైన మృతుల సంఖ్యను చెప్పాలని డిమాండ్ చేశారు. 

కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు  చేయకుండా.. కేవలం ప్రమోషన్లలో బిజీలో ఉందని విమర్శించారు.100 కోట్ల మంది భక్తులకు సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ.. మహాకుంభ్‎లో కీలక ఘట్టమైన అమృత స్నానం నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే కుంభమేళాలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందారని ఫైర్ అయ్యారు అఖిలేష్. 

Also Read :- స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు రెడీ

తొక్కిసలాట ఘటనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుంభమేళా తొక్కిసలాట మృతులకు రెండు నిమిషాల మౌనం పాటించాలని కోరారు. తొక్కి సలాట జరిగిన స్థలంలో ఆధారాలు ధ్వంసం చేయడానికి ప్రభుత్వం జేసీబీలు ఉపయోగిస్తోందని మండిపడ్డారు. కుంభ మేళా భద్రత విషయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని.. బీజేపీ డబుల్ ఇంజిన్లు ఒకదానికొకటి ఢీకొంటున్నాయని ఎద్దేవా చేశారు. కుంభమేళా భద్రతను భారత సైన్యానికి అప్పగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అఖిలేష్ యాదవ్.