తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాయి అక్కినేని కుటుంబం, గ్రూప్ సంస్థలు. వరద బాధితుల కోసం ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌లకు రూ.1 కోటి రూపాయలు విరాళం అందించారు.
ఈ మేరకు చెరో రూ.50 లక్షల చొప్పున రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించాయి. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ సంస్థలు ఈ విరాళాలు అందజేస్తున్నాయి.
‘‘ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’’ అని వెల్లడించారు.
అయితే, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఇలాంటి ప్రకృతి విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవడానికి,వారికి అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుంటారు.ఇక ఇప్పుడు నాగార్జున కూడా అదే బాటలో పయనించడంతో అక్కినేని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.