కరీంనగర్ టౌన్, వెలుగు: ఏడేళ్ల కింద ఏపీలో తప్పిపోయిన బాలిక అక్ష(10) సోమవారం కరీంనగర్‌లో దొరికింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన ద్వారక, రవి దంపతులు. భార్యాభర్తలు గొడవపడడంతో 2016లో మూడేళ్ల బాలిక, తండ్రి రవి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈక్రమంలో ఎక్కడెక్కడో తిరిగిన అక్ష.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని భాగ్యలక్ష్మి అనే మహిళ వద్దకు చేరింది.
స్థానికులు అనుమానించి బాలికను పోలీసులకు అప్పగించడంతో వారు బాలరక్షాభవన్ లో చేర్చారు. చిన్నారి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను చూసిన చిన్నారి బంధువులు కరీంనగర్ కు వచ్చి బాలికను గుర్తుపట్టారు. వారి సమాచారంతో సోమవారం బాలిక తల్లి, తండ్రి వేర్వేరుగా కరీంనగర్ వచ్చారు. అన్ని ఆధారాలను నిర్ధారించుకున్న అధికారులు కలెక్టర్సమక్షంలో బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.