రూ.10 కోట్లకు కుచ్చుటోపీ .. బాధితులను నిండా ముంచిన అక్షర చిట్​ఫండ్​ కంపెనీ

రూ.10 కోట్లకు కుచ్చుటోపీ .. బాధితులను నిండా ముంచిన అక్షర చిట్​ఫండ్​ కంపెనీ
  • లబోదిబోమంటున్న చీటీల సభ్యులు, డిపాజిటర్లు 
  • ఇందూర్​లో 72 మంది, బోధన్​లో సుమారు 200 మంది బాధితులు 
  • న్యాయం కోసం ఏడాదిగా ఆఫీసర్లు, లీడర్ల చుట్టూ చక్కర్లు

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో అక్షర చిట్​ఫండ్​ కంపెనీ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పిల్లల చదువులు, పెండ్లిళ్లు, ఇంటి నిర్మాణం వంటి వాటి కోసం చీటీలు వేసిన సభ్యులంతా రోడ్డున పడ్డారు. పొదుపు చేసుకుందామనుకున్న చిరువ్యాపారులు, ఉద్యోగులు మోసపోయారు.  డిపాజిట్ చేస్తే నాలుగేండ్లలో డబ్బులు డబుల్ ఇస్తామని చెప్పడంతో డిపాజిట్ చేసిన ఉద్యోగులు, వృద్ధులు నెత్తినోరు బాదుకుంటున్నారు. అక్షర చిట్​ఫండ్​ కంపెనీ సుమారు రూ. 10 కోట్ల వరకు టోకరా చేసింది. నిజామాబాద్​లో 72 మంది, బోధన్​లో 200 మంది బాధితులు దిక్కుతోచక కన్నీరు పెడుతున్నారు. 

బౌన్సర్​లతో బెదిరింపులు..

2019లో ఇందూర్, బోధన్​ టౌన్​లో అక్షర ఫైనాన్స్ రూ.10 లక్షలు, రూ.5 లక్షలు, రూ.3 లక్షలు రూ.2 లక్షల చీటీలు నడిపింది. చిట్​ యాక్షన్​ సీక్రెట్​గా ముగించి ఫలానా వారికి చీటీ వచ్చిందని  ప్రచారం చేసేవారు. 75 శాతం చీటీ పీరియడ్​ను అనుమానం రాకుండా లాక్కొచ్చారు. ఏడాది గడిచాక వారి అసలు రూపం బయటపడింది. రెండు నెలల కింద బాధితులు వరంగల్​ సిటీకి వెళ్లి కంపెనీ యజమానిని నిలదీయగా, తెలివిగా బౌన్స్​ చేయడానికి వీలులేని ఆర్టీజీఎస్​ నెఫ్ట్​ చెక్కులను చేతిలో పెట్టి పంపారు. 

ఇదేమిటని ప్రశ్నించగా బౌన్సర్లతో బెదిరించి పంపారని బాధితులు శర్మ, దేవీసింగ్ వాపోయారు. శ్మశాన వాటికలో మృతదేహాలను కాల్చగా వచ్చిన డబ్బు పోయిందని వీరయ్య కన్నీటిపర్యంతమయ్యాడు. నగరంలోని బాధితులు సోమవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యానారాయణకు లెటర్​ రాశారు. మీడియాకు తమ దీనగాధ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేదు. బోధన్ బాధితులు వచ్చే వారం మీటింగ్ పెట్టి చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.    

లోకల్​ ఏజెంట్లతో బురిడి..

వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన అక్షర ఫైనాన్స్​ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్​మెంట్​ జిల్లాలో తెలివిగా బిజినెస్​ సాగించింది. నాన్​లోకల్​ ఎంప్లాయీస్​ను ముఖ్యమైన పోస్టుల్లో పెట్టి లోకల్ యూత్​ను కమిషన్​ ఏజెంట్లుగా నియమించి దందా నడిపింది. పర్సనల్ టార్గెట్​లు విధించి ప్రమోషన్​ ఆశచూపడంతో వారూ తెలియకుండానే మేనేజ్​మెంట్​ ఉచ్చులో పడ్డారు. చీటీలో ఒక మెంబర్​ను జాయిన్ చేస్తే రూ.3 వేలు,  డిపాజిట్లపై రెండు శాతం కమీషన్ చెల్లించారు. రూ.10 లక్షల చిట్ లో 50 మంది మెంబర్స్​ను చేరిస్తే రూ. లక్షా 50 వేల దాకా కమీషన్ ఇవ్వడంతో ఏజెంట్లు పోటీ పడ్డారు. వారు లోకల్ వ్యక్తులు కావడంతో జనం నమ్మి చీటీలు, డిపాజిట్లు చేశారు.  ఇప్పుడా ఏజెంట్లు సైతం మోసపోయామని చెప్పడం కొసమెరుపు.