అక్షర చిట్ ఫండ్స్ మోసం..చిట్టీలు పూర్తయినా చెల్లించని వైనం

జగిత్యాల జిల్లాలో అక్షర  చిట్ ఫండ్ కంపెనీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా అక్షర చిట్‌ఫండ్‌ కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. చిట్టీల కాల పరిమితి ముగిసినా డబ్బులివ్వక ఆగం చేస్తోంది.  డిపాజిటర్లు ఎన్నిసార్లు మొరపెట్టకున్నా కనికరించక వేధింపులకు గురి చేస్తోంది. 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని అక్షర చిట్ ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ లో వందలాది మంది చిటీ డబ్బులు జమ చేసుకున్నారు. కొందరు నెల నెలకు చిటీ డబ్బులు కట్టగా..మరి కొందరు అధిక వడ్డీ వస్తుందని లక్షలు డిపాజిట్ చేశారు. ఈ క్రమంలోనే చెట్ల వనజ అనే మహిళ తన కొడుకు చందు పేరుమీద రూ.6.50 లక్షల విలువ చేసే చిట్టిలు కట్టింది. ఈ చిట్టిలు మార్చిలోనే ముగిశాయి. అయినా చిట్టి డబ్బులను అక్షర చిట్ ఫండ్ కంపెనీ వనజకు చెల్లించలేదు. పలు మార్లు అక్షర్ చిట్ ఫండ్ ఆఫీసు చుట్టూ తిరిగినా ఫలితం లేదు.

ALSO READ:Ollulleru: ప్రపంచాన్ని ఊపేస్తున్న మలయాళీ పాటకు 100 మిలియన్ వ్యూస్

జులై 3వ తేదీ సోమవారం చిట్ల వనజ దంపతులు అక్షర చిట్ ఫండ్ ఆఫీసుకు పరుగుల మందు డబ్బాతో వచ్చారు. తమకు రావాల్సిన చిట్టి డబ్బులు చెల్లించాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అయినా అక్షర చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులు స్పందించలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వెళ్లిపోయారు. దీంతో బాధితులు తాళాలు వేసి ..పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.