
- డిపాజిటర్ల డబ్బులు వాపస్ చేయని సంస్థ నిర్వాహకులు
- కరీంనగర్ సీపీ సిఫార్సుతో సర్కారు చర్యలు
కరీంనగర్, వెలుగు: అధిక వడ్డీ ఆశ చూపుతూ వేలాది మంది వద్ద వసూలు చేసిన డబ్బులతో అక్షర చిట్ ఫండ్ సంస్థ నిర్వాహకులు కొనుగోలు చేసిన రూ.14.27 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధితులకు తిరిగి డబ్బు ఇవ్వకపోగా, అర్ధాంతరంగా సంస్థలను మూసివేసి సభ్యులను మోసగించడంతో హన్మకొండకు చెందిన సంస్థ చైర్మన్ పేరాల శ్రీనివాసరావుతో పాటు డైరెక్టర్లు పేరాల శ్రీ విద్య, సూరనేని కొండలరావు, పుప్పాల రాజేందర్, అలువుల వరప్రసాద్, గోనె రమేశ్‌పై గత ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేగాక తెలంగాణ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ డిపాజిటర్ల రక్షణ చట్టం,1999 (చట్టం నం.19 ఆఫ్ 1999) సెక్షన్ 5 కింద అక్షర టౌన్ షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సంపాదించిన స్థిరాస్తులను అటాచ్ చేయాలని అప్పట్లోనే సీఐడీ డీజీపీ ద్వారా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ప్రభుత్వాన్ని కోరారు.
చిట్ ఫండ్స్ నిర్వాహకులు డిపాజిటర్స్ డబ్బులతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామ శివారులో కొనుగోలు చేసిన రూ.11.50 కోట్ల విలువ చేసే 50 ఎకరాల భూములు, ఇదే మండలం వెలిచాల గ్రామ పరిధిలో కొనుగోలు చేసిన 2.7లక్షలు విలువ చేసే సర్వే నెంబర్ 129/ఏ , 130/ఏలోని 24,606 చదరపు గజాల స్థిరాస్తులను ఇతరులకు విక్రయించేందుకు వీలు లేకుండా అటాచ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.