సరిగ్గా పదివేల రూపాయలు పెట్టుబడి.. ఒక్క ఏడాదిలో అక్షరాలా యాభై లక్షల రెవెన్యూ.. లక్షల్లో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్... ఇది పూణెకి చెందిన అక్షతా జైన్ గ్రీటింగ్ కార్డులతో చేసిన రికార్డు. అయితే ఇదంతా పక్కా ప్లానింగ్‌తో మొదలైన బిజినెస్ కాదు. ఓ ఇన్స్టాగ్రామ్ రీల్.. ఈ హౌస్ వైఫ్లో దాగున్న ఆర్టిస్ట్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె ప్యాషన్‌ని ప్రొఫెషన్‌గా మార్చేసింది. తనని సక్సెస్ఫుల్ ఎంట్రప్రెనూర్‌గా నిలబెట్టింది. ఇంతకీ ఈ అక్షతా గ్రీటింగ్ కార్డుల స్పెషాలిటీ ఏంటంటే..
చిన్నప్పట్నించీ ఆర్ట్, క్రాఫ్ట్సే అక్షతాకి ఆటవిడుపు. అలాగని తనేం ప్రొఫెషనల్‌గా నేర్చుకోలేదు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఆర్ట్ అండ్ క్రాఫ్టింగ్‌లో ఎక్స్పర్ట్ అయింది. దాంతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్లో ఏ పండగైనా, పబ్బమైనా తను తయారుచేసిన గ్రీటింగ్ కార్డులనే గిఫ్ట్‌గా ఇచ్చేది. అయితే ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ అంటే పేపర్, కార్డుతో చేసినవి కాదు. తను వెళ్లే పార్టీ, ఫంక్షన్.. థీమ్‌ని బట్టి డిఫరెంట్‌గా తన గ్రీటింగ్ కార్డుల్ని డిజైన్ చేసేది. అలాగే ఫుర్షోకి... అంటే రంగురంగుల ఫ్యాబ్రిక్స్‌తో డిఫరెంట్ స్టైల్స్‌తో గిఫ్ట్ ప్యాకింగ్ చేయడం. అలాగే హ్యాండ్ పెయింటింగ్, లెటరింగ్ గిఫ్ట్ ర్యాపర్స్ తయారుచేయడం అన్నమాట. ఈ జపనీస్ ఫేమస్ ఆర్ట్‌లోనూ ఎక్స్పరిమెంట్స్ చేస్తుండేది అక్షతా. అవి బాగా నచ్చడంతో తెలిసిన వాళ్లందరూ అడిగి మరీ తనతో కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తయారు చేయించుకునేవాళ్లు. కానీ, క్రాఫ్టింగ్ని ఒక హాబీగానే చేసింది. అందుకే వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఎంబీఏ వైపు వెళ్లింది.
ఒక్క రీల్‌కి 19 లక్షల వ్యూస్
ఎంబీఏ పూర్తయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది అక్షతా. అప్పుడే క్లాత్‌పై రంగురంగుల దారాలతో చేసే ఎంబ్రాయిడరీ వర్క్ వైపు మళ్లింది తన మనసు. మరుసటి రోజునుంచే యూట్యూబ్ సాయంతో ప్రయోగాలు మొదలుపెట్టింది. కానీ, అంతలోనే పెండ్లి కావడంతో... ఇంటి బాధ్యతల్లో పడి కొన్నాళ్లు క్రాఫ్టింగ్ని పక్కనపెట్టింది. కానీ, ఏదో తెలియని వెలితి వెంటాడుతున్నట్టు అనిపించిందామెకి. దాంతో రోజూ ఇంటి పనులు పూర్తయ్యాక కాసేపు క్రాఫ్టింగ్ మీద కూర్చునేది. అలా సాగిపోతున్న అక్షతా లైఫ్‌ని మళ్లీ పూర్తిగా క్రాఫ్టింగ్ వైపు నడిపించింది తన బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్. ఫ్రెండ్ కోసం ఎంబ్రాయిడరీ హూప్తో గ్రీటింగ్ కార్డు తయారుచేసింది అక్షతా. ఆ మేకింగ్ వీడియోని ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసింది. దానికి ఏకంగా 19 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రెండు వారాల్లోనే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఐదొందల నుంచి 75,000లకి చేరింది. మరికొద్ది రోజుల్లోనే లక్ష దాటింది. వందల్లో కస్టమైజ్డ్ ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఇన్స్పిరేషన్తోనే సొంతంగా ‘నాట్ యువర్ టైప్’ అనే గిఫ్టింగ్ సర్వీస్‌ని మొదలుపెట్టింది.
యాభై లక్షల టర్నోవర్
2021 జూన్‌లో పదివేల పెట్టుబడితో గిఫ్టింగ్ సర్వీస్‌ని మొదలుపెట్టింది అక్షతా. అయితే మొదట్లో ఇంటి నుంచే పనిచేసేది. కానీ, రానురాను ఆర్డర్స్ సంఖ్య బాగా పెరిగింది. దాంతో బిజినెస్‌ని స్టూడియోకి షిఫ్ట్ చేసింది. ఆర్డర్స్‌ని ఈజీగా ట్రాక్ చేయడానికి వెబ్సైట్ డిజైన్ చేసింది. కరోనా, లాక్డౌన్లో మెటీరియల్ కొనడం కష్టమైంది. గిఫ్ట్ డెలివరీలోనూ టెక్నికల్‌గా కొన్ని ఇబ్బందులొచ్చాయి. పైగా సోషల్ మీడియా నుంచి హ్యాండ్ క్రాఫ్టింగ్, ఆర్డర్స్ ట్రాకింగ్ అన్నీ అక్షతానే చూసుకునేది మొదట్లో. తర్వాత తర్వాత మరో పదిమంది ఆడవాళ్లకి ఎంబ్రాయిడరీలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకుంది. సంవత్సరంలో యాభై లక్షల టర్నోవర్ సాధించింది.
“ ఇంటి, వంట పనుల మధ్య నెలకో పది ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే చాలనుకునేదాన్ని. అలాంటి నేను ఇప్పుడు నెలకి రెండొందల ఆర్డర్స్ తీసుకుంటున్నా. మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నా. నాలానే ఎవరైనా తమకి నచ్చిన బిజినెస్ చేయాలనుకుంటే... ఫెయిల్యూర్ గురించి ఆలోచించొద్దు. ఒక్క అడుగు ముందుకు వేసి.. వందశాతం ఎఫర్ట్ పెడితే సక్సెస్ వెంటే నడిచొస్తుంది. ఫ్యూచర్లో నాట్ యువర్ టైప్ని దేశంలోని ది బెస్ట్ పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ సర్వీస్‌గా నిలబెట్టాలనుకుంటున్నా’’ అంటోంది అక్షతా.