
అక్షయకల్ప నుంచి ఆర్గానిక్ పళ్లు, కూరగాయలు
ఇందుకోసం శంషాబాద్‌లో క్లస్టర్
రూ.300 కోట్ల రెవెన్యూ టార్గెట్
హైదరాబాద్, వెలుగు : భారతదేశపు మొట్టమొదటి సర్టిఫైడ్ ఆర్గానిక్ వెజిటబుల్, ఫ్రూట్స్, పాల ఉత్పత్తుల కంపెనీ అయిన అక్షయకల్ప తెలంగాణలో అడుగుపెడుతోంది. సేంద్రీయ బచ్చలికూర, టొమాటో, మిరపకాయ బెండకాయలతో పాటు అనేక ఇతర అవసరమైన కూరగాయలు పండ్లను అందిస్తుంది. పాలు, మజ్జిగ, నెయ్యి, పిండి, పనీర్, పెరుగు, చీజ్, వెన్న, కొబ్బరి, బ్రెడ్, తేనె, మూలికలు, గుడ్లు కూడా అమ్ముతుంది.
అక్షయకల్ప సీఈఓ శశి కుమార్ మాట్లాడుతూ ‘‘మాది బెంగళూరు కేంద్రంగా పనిచేసే కంపెనీ. ఇది వరకే తమిళనాడు, కర్ణాటకలో అగ్రికల్చర్ క్లస్టర్లను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లోని శంషాబాద్దగ్గర్లో మరో క్లస్టర్‌ను డెవెలప్ చేస్తున్నాం. 300 మంది రైతులకు సేంద్రీయ వ్యవసాయం నేర్పించి, వారి ప్రొడక్టులను మేమే కొంటాం. గత సంవత్సరంలో రూ. 117 కోట్ల నిధులను సమీకరించాం. రూ. 205 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 300 కోట్లు దాటుతుందని భావిస్తున్నాం. ప్రస్తుతం, కంపెనీకి బెంగళూరు, చెన్నై హైదరాబాద్‌లో 60 వేల మంది మంది కస్టమర్లు ఉన్నారు వచ్చే నెలలో చెంగల్‌పట్టులో కార్యకలాపాలను ప్రారంభిస్తాం. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో రూ.22 నుంచి 30 కోట్ల పెట్టుబడితో వచ్చే మూడేళ్లలో క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం”అని వివరించారు.