- తెలంగాణలో వంద రెట్లు పెరిగిన అవినీతి
- విద్య, వైద్య రంగాలను తొక్కేశారు: ఆకునూరి మురళి
ధర్మపురి/మంచిర్యాల, వెలుగు : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను సీఎం కేసీఆర్ తొక్కేశారని, అవినీతిని వంద రెట్లు పెంచారని సోషల్ డెమోక్రటిక్ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి ఫైరయ్యారు. అవినీతి లేని తెలంగాణ కోసం అన్ని వర్గాల వారు మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా మురళి చేపట్టిన జాగో తెలంగాణ బస్సు యాత్ర శుక్రవారం జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం పరిరక్షణ గురించి మాట్లాడే అర్హత సీఎం కేసీఆర్కు లేదని ప్రజల అన్నారు. సమిష్టి పోరాటాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాల వల్ల ఏర్పడిన తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం.. దొరలు, దోపిడీ తెలంగాణగా మార్చిందని విమర్శించారు. విద్య, వైద్యానికి బడ్జెట్లో కోతలు పెట్టారని, కేవలం రూ.28 వేల కోట్లు కేటాయిస్తే.. 200 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మించవచ్చన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకే తాను ముక్కలని, ఒకరి అవినీతిని మరొకరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓటు వేయకుండా బుద్ధి చెప్పాలన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలన్నీ యథావిధిగా నడుస్తాయన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా పిలల్ల భవిష్యత్తును నాశనం చేస్తున్న బీఆర్ఎస్కు ఓటేయొద్దని వృద్ధులను కోరారు. ఏ ప్రభుత్వం ఉన్నా పెన్షన్ను ఎవరూ తొలగించలేరన్నారు. కాలుష్యకారకమైన ఇథనాల్ప్రాజెక్టును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా మంత్రి కొప్పుల ఈశ్వర్ చూడాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రాజెక్టులు, పథకాల్లో అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలుస్తానని కేసీఆర్ కలలు కంటున్నాడని, కానీ ఆయనను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయయారని మురళి అన్నారు.