- రాష్ట్రం వచ్చాక ఒక్క స్కూలూ ఏర్పాటు చేయలే
- మేం ఒత్తిడి చేస్తే ‘మన ఊరు మన బడి’ తీసుకువచ్చిన్రు
- గత ఏడాది ఫండ్స్ ఇయ్యలే...
- బీఆర్ఎస్, బీజేపీలకు ఓటెయ్యద్దు
- రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి
కామారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశా యని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఆరోపించారు. తెలంగాణ జాగో పేరిట సాగుతున్న బస్సుయాత్ర సోమవారం కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన వాకర్స్‌తో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్తగా ఒక్క స్కూల్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఎడ్యుకేషన్ హబ్పేరిట గజ్వేల్‌లో షో పుటప్ చేశారన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ పేరుతో తాము డిమాండ్ చేస్తే మన ఊరు మన బడి ప్రోగ్రామ్ తీసుకువచ్చారన్నారు.
గత సంవత్సరం ‘మన ఊరు మన బడి’కి స్పెషల్‌గా బడ్జెట్లో ఏ మాత్రం నిధులు కేటాయించలేదన్నారు. కేసీఆర్ సర్కారు తీరుతో 35 లక్షల మంది నిరుద్యోగులు బాధపడుతున్నారన్నారు. ఇంటికో ఉద్యగం అని చెప్పిన కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. పంట పండించే నిజమైన రైతులకే రైతుబంధు ఇవ్వాలని, సినిమా హీరోలకు రైతు బంధు అవసరమా? అని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ వన్ ఆఫీసర్లు కూడా రైతులా ? అని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయవద్దన్నారు. తాము ఏ పార్టీకి సపోర్టు కాదని, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామన్నారు.
ప్రతినిధులు లక్ష్మీనారాయణ, నైనాల గోవర్ధన్ ఉన్నారు. కాగా, కామారెడ్డిలో వాకర్స్‌తో మాట్లాడుతున్న టైంలో ఎన్నికల ఆఫీసర్లు వచ్చి అడ్డు చెప్పారు. తర్వాత బస్టాండ్ దగ్గర మీటింగ్నిర్వహించాల్సి ఉండగా పర్మిషన్ లేదన్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్నామని, పర్మిషన్ తీసుకున్నామని చెప్పగా.. మైక్ పర్మిషన్ లేదని అభ్యంతరం తెలిపారు. వినకపోతే సుమోటోగా కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.