గద్వాల, వెలుగు: విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, విద్యా వ్యవస్థలో కొత్త విధానాలను రూపొందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చెప్పారు. గద్వాల కలెక్టరేట్‌లో శనివారం టీచర్లు, పేరెంట్స్, ఎంఈవోలతో మీటింగ్ నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ సంతోష్‌తో కలిసి ఎంఈవోలతో రివ్యూ జరిపారు.
విద్యా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థను ప్రాథమిక స్థాయి నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కమిషన్ సభ్యులు జోత్స్న శివారెడ్డి, చారకొండ వెంకటేశ్, విశ్వేశ్వరయ్య, డీఈవో రవీందర్, డీఐఈవో హృదయ రాజు పాల్గొన్నారు.