నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు : అసమర్థ పాలన కొనసాగించిన నియంత సీఎం కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని తెలగాణ ప్రజాస్వామ్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. జాగో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఓటరు చైతన్య బస్సు యాత్ర గురువారం వరంగల్ జిల్లా నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన వెంటనే 360 కోట్ల రూపాయలతో కేసీఆర్ ప్రగతి భవన్ కోట కట్టుకున్నాడని విమర్శించారు.
అందులోకి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకుండా గేట్లు పెట్టి 70 మంది పోలీసులను కాపలా పెట్టుకున్నాడని ఫైర్ అయ్యారు. గత ముఖ్యమంత్రుల వద్దకు సామాన్యులు వెళ్లి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండేదని, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారు. లక్షా 91వేల జాబ్‌లు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశాడు.
ఇక రైతుబంధు రైతులకే ఇవ్వాలి, కానీ సినీ యాక్టర్లు, ఫాంహౌజ్‌లలో ఎంజాయ్ చేసే బడాబాబులకు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి.. కనీసం లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు’ అని విమర్శించారు. మద్యానికి, నోటుకు, కులానికి, మతానికి లోబడకుండా ప్రజలంతా ఆలోచించి సమర్థులకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్డీఎఫ్ లీడర్లు వినాయక్‌రెడ్డి, పద్మజ, నిర్మల, గోవర్ధన్, శంకర్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.