- దోచుకున్న డబ్బుతో గెలవాలనుకుంటున్న కేసీఆర్: రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి
- ప్రజలను బాల్క సుమన్ పీడిస్తున్నరని ఫైర్
మంచిర్యాల, వెలుగు : అమరవీరుల ఆత్మబలిదానాలు, ఉద్యమకారుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో అవినీతి, నియంతృత్వ, అరాచక పాలన సాగుతోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. ఈ రాక్షస పాలనను అంతం చేసి కేసీఆర్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. జాగో తెలంగాణ ఓటర్ చైతన్య బస్సు యాత్రలో భాగంగా గురువారం ఆయన మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఉదయం చెన్నూరులో వాకర్స్ తో, తర్వాత కొత్త బస్టాండ్ వద్ద మీటింగ్ నిర్వహించారు.
తర్వాత భీమారం, జైపూర్, నెన్నెల, బెల్లంపల్లి, సోమగూడెం, మందమర్రి మీదుగా రాత్రి 8.30కు మంచిర్యాలకు చేరుకుంది. బస్టాండ్ ఎదురుగా జరిగిన మీటింగ్లో ఆకునూరి మురళి మాట్లాడారు. 1,200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణను కేసీఆర్ ఆగం చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, దళితులకు భూములు అంటూ అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
వివిధ శాఖల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం ఫెయిలైందని విమర్శించారు. గ్రూప్స్ పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఈ సర్కారు చెలగాటమాడుతోందని అన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు ప్రభుత్వ విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారాయన్నారు. 20 లక్షల మంది నిరుపేదలకు ఇండ్లు లేవని, కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూంలు కట్టించినా వాటిని ఐదేండ్లుగా పంచకపోవడంతో కూలిపోతున్నాయని విమర్శించారు. రైతుబంధు పేరుతో భూస్వాములకు రూ.28 వేల కోట్లు పంచిపెట్టాడని ఆరోపించారు. దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు అన్ని బంధులు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలకే దక్కాయన్నారు.
లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బండారం బయటపడ్డదని అన్నారు. ఇందులో కేసీఆర్ కమీషన్లు దోచుకున్నాడని, అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలుస్తా అనుకుంటున్నాడని అన్నారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ వచ్చాక రాష్ట్రంతో పాటు తమ కుటుంబం కూడా బాగుపడ్డదంటూ సిగ్గు లేకుండా తాము అవినీతి చేస్తున్నామని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం కేసీఆర్ బాటలోనే అవినీతి, అక్రమాలకు, అణిచివేతకు పాల్పడుతూ ప్రజలను పీడిస్తున్నాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవినీతి పాలనను అంతమొందించాలని ఆయన కోరారు.