బీఆర్​ఎస్, బీజేపీకి ఓటెయ్యద్దు: ఆకునూరి మురళి

నిజామాబాద్, వెలుగు: కేసీఆర్​గవర్నమెంట్​మళ్లీ వస్తే రాష్ట్రం నాశనమవుతుందని రిటైర్డ్​ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. తెలంగాణ జాగో పేరుతో ఆయన నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఆదివారం నిజామాబాద్​చేరుకుంది. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి వచ్చిన ఆయనకు ప్రజాసంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఉదయం పాలిటెక్నిక్​గ్రౌండ్​లో మార్నింగ్​ వాక్​ చేస్తున్న వారితో గ్రూప్​ మీటింగ్ నిర్వహించారు. నెహ్రూ పార్క్​చౌరస్తా, రైల్వే స్టేషన్​వద్ద మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను సీఎం కేసీఆర్​కుటుంబం తన్నుకుపోతోందన్నారు. 

ప్రధాని మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికి కేసీఆర్​మద్దతుగా ఉన్నారని, బీఆర్ఎస్, బీజేపీలకు ఓటెయ్యవద్దని, వారిని ఓడించాలని తాము రాష్ట్రవ్యాప్తంగా 60 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నామన్నారు. కేసీఆర్​ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిందన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైం దని ప్రశ్నించారు. సెగ్మెంట్ ​కో సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్, ఇంటికో ఉద్యోగం ఎక్కడన్నారు? అదానీ, అంబానీలకు ఊడిగం చేసే ప్రధాని మోదీ మత విద్వేష ఫాసిస్టు పాలన సాగిస్తున్నారన్నారు. 

కార్పొరేట్​ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఎన్నుకోవాలన్నారు. ఫలానా వారిని గెలిపించమని తాము కోరడం లేదని, ఎన్నికల్లో తాము పోటీ  చేయడం లేదన్నారు. జాగో తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త నైనాల గోవర్ధన్, సీపీఐ (ఎంఎల్)​ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సహాయ కార్యదర్శి వి.ప్రభాకర్,​ప్రజా సంఘాల నేతలు హన్మేశ్, ప్రదీప్, సుధాకర్, మల్లేశ్, షేక్​హుస్సేన్ పాల్గొన్నారు.