కేసీఆర్​ పాలన ఒక్క శాతం .. రాజకీయాలు 99 శాతం: ఆకునూరి మురళి

  • లక్ష ఇండ్లు కట్టి ఒక్కరికీ ఇవ్వని దుర్మార్గుడు  
  • నాలుగు స్కూల్స్​ బాగు చేసి  రాష్ట్రమంతా జిమ్మిక్కులు 
  • రైతు కాని వారికి రూ.28 వేల కోట్ల రైతు బంధా? 
  • మాజీ ఐఏఎస్​ ఆకునూరి మురళి

నిజామాబాద్, వెలుగు : గతంలో గవర్నమెంట్​నడిపిన పాలకులు 90 శాతం ప్రజల కోసం పనిచేసి 10 శాతం మాత్రమే రాజకీయాలు చేయగా సీఎం కేసీఆర్​ ఒక శాతం పనిచేసి 99 శాతం పాలిటిక్స్​ చేస్తున్నారని మాజీ​ఐఏఎస్​అధికారి ఆకునూరి మురళి అన్నారు. ఎనిమిది మంది సీఎంల దగ్గర 40 ఏండ్ల సర్వీసు చేసిన అనుభవంతో ఈ విషయం చెబుతున్నానన్నారు. ప్రజలను భ్రమలో పెట్టి సంపాదనకు ఎగబడడమే కేసీఆర్​విధానమన్నారు. నిజామాబాద్​లో మంగళవారం ‘జాగో తెలంగాణ’ పేరుతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 

సీఎంగా కేసీఆర్​ చేసిన రూ.19 లక్షల కోట్ల ఖర్చులో రూ.లక్ష కోట్లు విద్యపై, రూ.50 వేల కోట్లు వైద్యంపై వినియోగిస్తే అద్భుతమైన స్కూల్స్​, హాస్పిటల్స్​ ఏర్పడేవన్నారు. కార్పొరేట్​ స్థాయి విద్య, వైద్యం అందేదన్నారు. గజ్వేల్, సిరిసిల్లా, సిద్దిపేటతో పాటు ఆయన మనువడు హిమాన్ష్​ కట్టిన నాలుగు బడులను రాష్ట్రమంతా తిప్పి మొత్తం తెలంగాణ స్కూల్స్​ఇలాగే ఉన్నాయన్నట్టు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 

కేసీఆర్ ​ఓ దుర్మార్గుడు 

రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు ఇండ్లులేక అవస్థలు పడుతుండగా వీరిని సీఎం మోసగిస్తున్నారని మురళి విమర్శించారు. 2016లో వీళ్లందరి నుంచి అప్లికేషన్లు తీసుకున్న కేసీఆర్ ​రెండు లక్షల ఇండ్ల నిర్మాణానికి అనుమతులిచ్చి లక్ష ఇండ్లు మాత్రమే నిర్మించారన్నారు. 30 వేల కుటుంబాలకు కేటాయించి ఒక్కరికీ ఇళ్లు అప్పగించని దుర్మార్గుడు కేసీఆర్​అని అన్నారు. నిరుద్యోగుల ఓట్లు పడవని నోటిఫికేషన్లతో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. రైతుబంధు పేరుతో ఇప్పటిదాకా రూ.28 వేల కోట్లను రైతులుకాని వారికి పంపిణీ చేశారని, అది ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. 

ఇన్​కమ్​ట్యాక్స్ కడుతున్న ధనవంతులకు రైతుబంధు ఎందుకన్నారు. 20 లక్షల మంది కౌలు రైతులు ఇన్సూరెన్స్, లోన్, సబ్సిడీ లేకుండా వ్యవసాయం చేస్తున్నా కేసీఆర్​కు కనబడడంలేదని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని లిక్కర్ స్కామ్​లో కవిత అరెస్టు కాకపోవడానికి కారణం అదేన్నారు.  

కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించాలె..

కేసీఆర్​ను కామారెడ్డిలో ఓడిస్తే రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు గుర్తింపు వస్తుందని జస్టిస్​ చంద్రకుమార్​ అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నాశనం చేసే పాలన నడుస్తోందన్నారు. మతం పేరుతో బీజేపీ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. బీఆర్ఎస్​, బీజేపీలకు సమానదూరం పాటించాలన్నారు. వక్తలు జాహెద్​ ఖాద్రీ, లక్ష్మీనారాయణ, ఖాలెదాపర్వీన్​, పృథ్వీ, వినాయక్​రెడ్డి, పద్మజాషా, కృష్ణ, ప్రభాకర్​, అబ్దుల్​ అజీజ్​,  స్కైబాబా ఉన్నారు.