సూర్యాపేట/కోదాడ, వెలుగు : ఓటర్లు మద్యానికి, నోటుకు లొంగ వద్దని జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి సూచించారు. జాగో తెలంగాణ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న ఓటు చైతన్య యాత్ర శనివారం సూర్యాపేట జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా సూర్యాపేట, కోదాడలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో విద్యా, వైద్యం పూర్తిగా నాశనమైందన్నారు. త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నిలువునా పాతిపెట్టిందని మండిపడ్డారు.
ప్రాణహిత తుమ్మిడి హెట్టి నుంచి కాళేశ్వరనికి మార్చిన కేసీఆర్ ఘోరమైన అవినీతి వల్లే ప్రాజెక్టు కుంగిపోయిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని గద్దె దించేందుకు ప్రజలు తమ ఓటును ఆయుధంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాగో తెలంగాణ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కమిటీ సభ్యులు వినాయకరెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, నైనాల గోవర్ధన్, కృష్ణ ప్రసాద్, జానయ్య, న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, ప్రజాపంథా నాయకులు హన్మేశ్, ప్రదీప్ ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు.