మళ్లీ అల్ ఖైదా అలికిడి

మళ్లీ అల్ ఖైదా అలికిడి

ఆల్ ఖైదా  ఓ మామూలు టెర్రరిస్టు సంస్థ కాదు. కరడుగట్టిన టెర్రరిజానికి మరో పేరు.  ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్టులు తెగబడ్డా అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది అల్ ఖైదా నే. మతాన్ని అడ్డం పెట్టుకుని హింసకు దిగడమే పనిగా పెట్టుకున్న అల్ ఖైదా  పుట్టి పాతికేళ్లు దాటింది. ఒసామా బిన్ లాడెన్ డైరెక్షన్ లో 1988 ఆగస్టులో ఈ సంస్థ పుట్టింది. అప్పటి నుంచి జిహాద్ పేరుతో  అమాయకుల రక్తం పారించడం మొదలెట్టింది. తన ఉన్మాద చర్యలతో  ప్రపంచ శాంతికే డేంజర్ గా మారింది. ఈ సంస్థ ఆర్డర్ ఇస్తే వెనకా ముందు ఆలోచించకుండా హింసకు పేట్రేగే ఎన్నో అనుబంధ సంస్థలున్నాయి. అది సోమాలియాకు చెందిన అల్ షబాబ్ కావచ్చు. ట్యునీసియా కు చెందిన అన్సరాల్ షరియా కావచ్చు. మరోటి కావచ్చు. ఏ దేశానికి చెందిన టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అయినా అల్ ఖైదా  నుంచి ఆర్డర్ వస్తే  కళ్లు మూసుకుని పాటించాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అల్ ఖైదాకు  వేలాది మంది కమాండర్లు ఉన్నారు. వీళ్లంతా నలభైకు పైగా దేశాల్లో  ఎప్పుడూ  టెర్రరిస్టు యాక్టివిటీస్ లో బిజీగా ఉంటారు. యాక్షన్ ప్లానులు తయారు చేస్తుంటారు.

కఠినమైన ట్రైనింగ్

రిక్రూట్ మెంట్లకు అల్ ఖైదా టాప్  ప్రయారిటీ ఇస్తుంది. కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారికి చాలా కఠినమైన ట్రైనింగ్ ఇస్తుంది.  ఏయే అంశాలపై  ట్రైనింగ్  ఇవ్వాలో చెప్పడానికి పక్కాగా ఓ మాన్యువల్ కూడా ఉంటుంది. 2000లో మాంచెస్టర్ పోలీసులకు అల్ ఖైదా  ట్రైనింగ్ మాన్యువల్ కాపీ దొరికింది.

అనేక దేశాల్లో నిషేధం

అల్ ఖైదాను అనేక దేశాలు నిషేధించాయి. దీంతో  రకరకాల పేర్లతో  కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. కొత్త గా వచ్చిన ఈ సంస్థల ముసుగులో అల్ ఖైదా  తన టెర్రరిస్టు యాక్టివిటీస్ ను కంటిన్యూ చేస్తోంది. దాడులు జరిగి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత కానీ అది వేరే సంస్థ పేరుతో  అల్ ఖైదా  చేసిన పనేనన్న విషయం తెలియడం లేదు.

జైషే మహమ్మద్ తో అల్ ఖైదాకు  సంబంధాలు

జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిజాన్ని రాజేస్తున్న సంస్థల్లో  జైషే మహమ్మద్ ముఖ్యమైంది. 19 ఏళ్ల కిందట కరాచీలో  ఏర్పాటైన ఈ సంస్థతో  అల్ ఖైదా కు సంబంధాలున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపుర జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై  జైషే మహమ్మద్  ఆత్మాహుతి దళ సభ్యుడు దాడి చేసి 40 మందికి పైగా పొట్టన పెట్టుకున్న తర్వాత మరోసారి కాశ్మీర్ లో టెర్రరిజం అంశం తెరమీదకు వచ్చింది. టెర్రరిస్టు సంస్థల్లో  పెద్దన్న వంటి అల్ ఖైదాకు  చెప్పకుండా జైషే మహమ్మద్ ఇంత పెద్ద ఘాతుకానికి  పాల్పడి ఉండదన్నది ఇంటెలిజెన్స్ వర్గాల అభిప్రాయం. దీంతో అల్ ఖైదా  తాను తెరమీదకు రాకుండానే  వేరే మిలిటెంట్ సంస్థతో ఎన్ని దాడులకైనా తెగబడుతుందన్న విషయం అందరికీ అర్థమైంది.  జైషే మహమ్మద్ చరిత్రలో చాలా ఘాతుకాలున్నాయి. పార్లమెంటు పై దాడికి పాల్పడడంతో  ‘ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్’ కింద ఈ సంస్థ ను ఇండియా నిషేధించింది. ఈ సంస్థకు పాకిస్తాన్ అండదండలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

2014 నుంచి ఇండియా పై  ప్రత్యేక దృష్టి 

2014 నుంచి దక్షిణాసియా పై  మరీ ముఖ్యంగా  ఇండియా పై అల్ ఖైదా  ప్రత్యేక దృష్టి పెట్టింది. కాశ్మీర్ ఇష్యూను అడ్డం పెట్టుకుని ముస్లింలను రెచ్చగొట్టడానికి పక్కాగా ప్లాన్ వేసింది. మొదటగా కాశ్మీర్ లోకి  ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇండియాలోని అనేక నగరాల్లో టెర్రరిస్టు దాడులకు తెగబడటం అల్ ఖైదా  టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి 2014 సెప్టెంబర్ లో కూడా అల్ జవ్​ హరి వీడియో వచ్చింది. అల్ ఖైదా  సౌతాసియా వ్యవహారాల చీఫ్ సనా ఉల్ హఖ్ కూడా ఇండియన్ గవర్నమెంట్ పై ముస్లింలను రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేశాడు.  వీటన్నిటితో పాటు ఇండియాలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలను కూడా టార్గెట్ చేయాలని అల్ ఖైదా  భావిస్తోంది.టార్గెట్ లను రీచ్ కావడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలకు అల్ ఖైదా  పదును పెడుతుంటుంది. 2013లో  బుర్ఖా బ్రిగేడ్ ను మొదలెట్టింది. ఈ బ్రిగేడ్,  అల్ ఖైదా కు అనుబంధ సంస్థ. ఈ బ్రిగేడ్ లో అందరూ ఆడవాళ్లే ఉంటారు. ఎంత డేంజరస్ వెపన్స్ దాచుకున్నా ఎవరికీ చిన్నపాటి అనుమానం కూడా రాకుండా బుర్ఖా కాపాడుతుంది.భద్రతా బలగాలకు ఈజీగా టోపీ వేసి దాడులకు తెగబడటానికి వీలుగా బుర్ఖా బ్రిగేడ్ ను ఏర్పాటు చేసింది అల్ ఖైదా.

పక్కా వ్యవస్థగా అల్ ఖైదా

చేసేది మతం పేరుతో అమాయక ప్రజలను చంపడమైనా అల్ ఖైదా ఒక పక్కా వ్యవస్థలా నడుస్తుంది. మిలిటెన్సీ కి సంబంధించిన అనేక ఇష్యూస్ పై నిర్ణయాలు తీసుకోవడానికి రకరకాల కమిటీలు ఉంటాయి. ఇందులో మిలటరీ కమిటీ ముఖ్యమైంది. ఎప్పటికప్పుడు కొత్త వాళ్లను రిక్రూట్ చేసుకోవడం, వాళ్లకు మోడ్రన్  వెపన్స్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇవ్వడం వంటి పనులు ఈ కమిటీ  చూసుకుంటుంది. మారణాయుధాలు కొనడానికి, ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన సొమ్మును పోగేసే  పని బిజినెస్  కమిటీ చూసుకుంటుంది. మీడియాకు వివరాలు ఇవ్వడానికి అల్ సహబ్ పేరుతో 2005 లో ఓ సంస్థను ఏర్పాటు చేసింది.

ఎవరీ అల్ జవ్హరి ?

అమెరికా కమెండోల చేతుల్లో హతమయ్యేంతవరకు అల్ ఖైదా  పూర్తిగా ఒసామా బిన్ లాడెన్ కనుసన్నల్లోనే  నడిచింది. ఒసామా హతమయ్యాక అల్ ఖైదా పగ్గాలు చేపట్టాడు అల్ జవ్​హరి. ఈజిప్టుకు చెందిన జవ్​హరి కైరో యూనివర్శిటీలో 1974 లో మెడిసిన్ చదువుకున్నాడు. తర్వాత ఈజిస్ట్  సైన్యంలో డాక్టర్ గా పనిచేశాడు. ఆర్మీ నుంచి బయటికొచ్చాక కొంతకాలం సొంతంగా క్లినిక్ నిర్వహించాడు. మంచి సర్జన్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత  జిహాదీ సిద్దాంతాలకు ఆకర్షితుడై టెర్రరిస్టుగా మారాడు. అల్ ఖైదా లోకి చేరాడు. చాలా తక్కువ టైంలోనే ఒసామాకు కుడిభుజంలా మారాడు. కొన్ని ముస్లిం దేశాల్లో అల్ ఖైదా  నెట్ వర్క్ ను పెంచాడు. 2001 లో అమెరికా ‘ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ’ (ఎఫ్ బీ ఐ) రిలీజ్ చేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్స్  జాబితాలో అల్ జవహరి పేరు కూడా ఉందంటే అతడు ఎంతటి డేంజరో అర్థం చేసుకోవచ్చు.

ఇంతకీ అల్ ఖైదా సత్తా ఎంత ?

అల్ ఖైదాకు వరల్ట్ వైడ్ గా నెట్ వర్క్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ సంస్థ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత ‘వార్ ఆన్ టెర్రర్ ’ పేరుతో అమెరికా వేట మొదలుపెట్టడంతో అల్ ఖైదా టెర్రరిస్టుల ఆటలు సాగలేదు. ఆ తర్వాత 2011 లో ఒసామా బిన్ లాడెన్ మృతి తర్వాత అల్ ఖైదా  బాగా దెబ్బతింది. ఈ టెర్రరిస్టు సంస్థ ను అన్ని దేశాలు టార్గెట్ చేశాయి. ఎక్కడ చిన్నపాటి దాడికి తెగబడ్డా ఆ దేశానికి చెందిన బలగాలు  కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టాయి. అంతమాత్రాన అల్ ఖైదా చాప్టర్ క్లోజ్ అని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మతం పేరు చెప్పి ముస్లింలను తమ వైపునకు తిప్పుకోవడం, చిన్న చిన్న టెర్రరిస్టు సంస్థలకు సొమ్ములు అందచేయడం  వంటి పనుల్లో అల్ ఖైదా ప్రస్తుతం బిజీగా ఉంది.

ఇండియన్ యూనిట్ పేరు

అన్సర్ ఘజ్ వత్ ఉల్ హింద్

లాడెన్ ఆదేశాల మేరకు అల్ ఖైదా ఇండియన్ యూనిట్ ను జకీర్ మూసా అనే టెర్రరిస్టు ఏర్పాటు చేశాడు. ‘ అన్సర్ ఘజ్​వత్ ఉల్ హింద్’ పేరుతో ఈ సంస్థ ఏర్పాటైంది. కాశ్మీర్ అంశం నేపథ్యంలో సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే టార్గెట్ గా ఈ సంస్థ పనిచేయడం మొదలెట్టింది.  ఈ ఏడాది సౌత్ కాశ్మీర్ లో జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో జకీర్ మూసా హతమయ్యాడు.

ట్విన్​ టవర్స్​ కూల్చివేతతో…

2001 వరకు అల్ ఖైదా గురించి చాలా దేశాలకు తెలియదు. అయితే  2001 సెప్టెంబర్ 11న  అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులకు తెగబడి ట్విన్ టవర్స్ ను కూల్చివేయడంతో అల్ ఖైదా ఎంతటి ఘాతుకాలు చేయగలదో అన్ని దేశాలకు తెలిసింది. ఈ టెర్రరిస్టు సంస్థకు వరల్డ్ వైడ్ గా నెట్ వర్క్  ఉంది.