- ఆదిపురుష్ మూవీ మేకర్స్ కు అలహాబాద్ హైకోర్టు చీవాట్లు
- రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమ, రావణుడిని చూపించి రామాయణం కాదంటారా?
- డైలాగులు అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ బోర్డు ఏం చేసిందని ఫైర్
- ఈ కేసులో కోరైటర్ మనోజ్ ను కక్షిదారుగా చేర్చాలని ఆదేశం
లక్నో : ఆదిపురుష్’ మూవీ మేకర్స్ పై అలహాబాద్ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ మూవీలోని డైలాగులు దేశంలోని చాలా మందిని ఆగ్రహానికి గురిచేశాయని, వారి మనోభావాలను దెబ్బతీశాయని చీవాట్లు పెట్టింది. సినిమా ఎలా తీసినా ప్రజలు చూస్తారని, వారికి బుర్రలేదని అనుకుంటున్నారా అని మూవీ మేకర్స్ ను నిలదీసింది. ఈ కేసులో సినిమా కోరైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లాను కక్షిదారుగా (పార్టీ) చేర్చాలని, వారంలోపు మనోజ్ స్పందించాలని కోర్టు ఆదేశించింది. ‘ఆదిపురుష్’ సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిల్ ను హైకోర్టు మంగళవారం విచారించింది. ‘‘ఆదిపురుష్ చిత్రంలోని డైలాగులు వివాదానికి దారితీశాయి. రామాయణం హిందువులకు ఎంతో పవిత్రమైనది. చాలా మంది పనిపై బయటికి వెళ్లేటపుడు రామచరిత మానస్ చదివి బయల్దేరతారు. అంతటి పవిత్ర గ్రంథంపై సినిమా ఎలా తీసినా ప్రజలు చూస్తారని అనుకుంటున్నారా? హిందువులు సహనంగా ఉంటారు కాబట్టి హిందువుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా?” అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘తాము తీసింది రామాయణం అని మూవీ డైరెక్టర్ అంటాడు. కాదు ఆదిపురుష్ అని రైటర్ మనోజ్ చెబుతున్నాడు. సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడిని చూపి రామాయణం కాదంటారా?” అని హైకోర్టు నిలదీసింది. సినిమా ఇంత వివాదాస్పదంగా ఉన్నా సెన్సార్ బోర్డు ఏం చేసిందని, అభ్యంతరకరమైన డైలాగులను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించింది. ‘‘హనుమ, సీత పాత్రను చాలా తక్కువగా చూపించారు. రామాయణంలో వారి పాత్రేమీ లేదన్నట్లు తీశారు. కొన్ని సీన్లు చిన్నవారు చూసేటట్లు లేవు. కుటుంబ సభ్యులతో కలిసి ఇలాంటి సినిమాలు చూడడం చాలా కష్టం. ఇది నిజంగా సీరియస్ మ్యాటర్” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. మూవీలో డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నా ఆ సినిమాను చూసిన ప్రజలు ఎలాంటి హింసకు పాల్పడలేదని, ఇది స్వాగతించదగ్గ పరిణామమని కోర్టు తెలిపింది.
డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పైనా మండిపాటు
ఆదిపురుష్ సినిమాలో అభ్యంతరకర డైలాగులను తొలగించారని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్ జీ) అలహాబాద్ హైకోర్టుకు తెలిపారు. అయితే, అప్పటిదాకా సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నదని, ఈ విషయం గురించి బోర్డుతో ఎందుకు చర్చించలేదని డీఎస్ జీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అభ్యంతరకర డైలాగులను తొలగిస్తే చాలదు. సీన్ల మాటేంటి? అవి కూడా అభ్యంతరకరంగానే ఉన్నాయి కదా. సినిమా ప్రదర్శనను నిలిపివేస్తే, ఆ చిత్రం చూసి సెంటిమెంట్లు దెబ్బతిన్న వారికి కాస్తయినా రిలీఫ్ దొరకుతుంది’’ అని కోర్టు పేర్కొంది. కొంతమంది థియేటర్లకు వెళ్లి సినిమాని నిలిపివేసినట్లు మీడియాలో వార్తలు చూశామని తెలిపింది. వారు థియేటర్లపై దాడికి దిగకపోవడాన్ని కోర్టు స్వాగతించింది. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.