- కాంగ్రెస్ పెద్దల హామీతో ఆర్డీఎస్ రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
- పదేండ్లుగా పట్టించుకోని గత సర్కార్
- మల్లమ్మకుంటకు జీవో ఇచ్చి చేతులు దులుపుకుందనే ఆరోపణలు
గద్వాల, వెలుగు: ఆర్డీఎస్ రైతుల చుట్టే ఆలంపూర్ రాజకీయాలు నడుస్తున్నాయి. పదేండ్లుగా గత ప్రభుత్వం ఆర్డీఎస్ రైతుల కష్టాలు పట్టించుకోలేదు. ఎన్నికల సందర్భంగా హడావుడిగా 2017లో రూ.783 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్ పనులు స్టార్ట్ చేసింది. కానీ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టలేదు. నాలుగున్నరేండ్లుగా సప్పుడు చేయకుండా అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని జీవో విడుదల చేసింది.
పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కేటీఆర్ అలంపూర్ లో నిర్వహించిన మీటింగ్ లో ఆర్డీఎస్, తుమ్మిళ్ల, నెట్టెంపాడు కంప్లీట్ చేసుకుందామంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ పెద్దలు రిజర్వాయర్ కంప్లీట్ చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తుండడంతో ఆర్డీఎస్ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వెరివేషన్ ఎస్టిమేషన్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసర్లకు మెమో జారీ చేసింది. కదలిక రావడంతో ఆర్డీఎస్ రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఇప్పటికీ చివరి ఆయకట్టుకు నీళ్లు రాలే..
ఆర్డీఎస్ పరిధిలోని 40వ డిస్ట్రిబ్యూటర్ చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలనే లక్ష్యంతో 2017లో రూ.783 కోట్లతో తుంగభద్ర నదిపై రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో రూ.162 కోట్లతో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టేందుకు జీవో నెంబర్ 428 జారీ చేసింది. అప్పట్లో వేరే ప్రాజెక్టుకు వాడిన పాత పైపులు, మోటార్లను తీసుకువచ్చి హడావుడిగా ఒక పంప్‌ను ఏర్పాటు చేసి 2018లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఎలాంటి పనులు చేపట్టకపోవడం రైతులకు శాపంగా మారింది. ఇప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి ఉంది.
ఒకే రిజర్వాయర్..
ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు రెండు పంప్ లు, మల్లమ్మ కుంట, జూలకల్, వల్లూరు గ్రామాల వద్ద మూడు రిజర్వాయర్లు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే భూసేకరణ చేయక పోవడం, రెండో పంప్ ను కంప్లీట్ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకే రిజర్వాయర్ నిర్మించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయించింది.
అందులోభాగంగా వేరివేషన్ ఎస్టిమేషన్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేరియేషన్ ఎస్టిమేషన్లు తయారు చేసి ఈఎన్సీ జనరల్ కు పంపించారు. గతంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ ను 0.5 టీఎంసీ సామర్ధ్యంతో నిర్మించాలని భావించారు. మూడు రిజర్వాయర్లకు భూసేకరణ ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో మల్లమ్మకుంట రిజర్వాయర్ కెపాసిటీని 0.5 టీఎంసీల నుంచి 1.02 టీఎంసీలకు పెంచి నిర్మించాలని వేరియేషన్ ఎస్టిమేషన్లు తయారు చేశారు. ఈ రిజర్వాయర్ కోసం 568 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే తుమ్మిళ్ల లిఫ్ట్ పనులు పెండింగ్‌లో ఉంచడంతో ఖర్చు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
రిజర్వాయర్ నిర్మాణం సవాలే..
ప్రస్తుతం నడిగడ్డలో భూముల విలువలు భారీగా పెరిగాయి. రిజర్వాయర్ల నిర్మాణానికి రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వాయర్ నిర్మాణం ప్రభుత్వానికి, ఆఫీసర్లకు సవాల్ తో కూడుకున్నదేనని చెప్పవచ్చు. వేరియేషన్ ఎస్టిమేషన్ వేశాక 568 ఎకరాల్లో పెగ్ మార్కింగ్( భూముల హద్దులు నిర్ణయించడానికి) వేయడానికి ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు వెళ్లినప్పుడు రైతులు అడ్డుకున్నారు. భూమికి భూమి ఇవ్వాలని లేదంటే మెరుగైన పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని తేల్చి చెప్పడంతో ఆఫీసర్లు మార్కింగ్ వేయకుండానే వెనుదిరిగారు. 3 నెలల కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి జీవో జారీ అయిన వెంటనే వడ్డేపల్లి మండలంలోని తనగల, పర్దీపురం గ్రామాల రైతులు కలెక్టరేట్ ను ముట్టడించారు.
ఆర్డీఎస్ చుట్టే రాజకీయాలు..
అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్ రగిల్చేందుకు ఆర్డీఎస్ ను వాడుకోగా, రాష్ట్ర ఏర్పాటు తరువాత ఓట్ల కోసం తుమ్మిళ్ల లిఫ్ట్‌ను తెరపైకి తెచ్చారు. కేవలం ఒక పంప్ ద్వారా నీటిని అందిస్తూ కాలం గడుపుతున్నారు. రిజర్వాయర్లు నిర్మించకపోవడంతో తుంగభద్రలో నీళ్లు లేకపోతే పంప్‌లు బంద్ అవుతున్నాయి. దీంతో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో హడావుడిగా పంప్ పనులు స్టార్ట్ చేసిన ప్రభుత్వం, అసెంబ్లీ తర్వాత ఎన్నికల ముందు మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం కోసం జీవోలు విడుదల చేయడం ఓట్ల కోసమేనన్న విమర్శలు వచ్చాయి.
ఎస్టిమేషన్లు పంపించాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లమ్మకుంట రిజర్వాయర్ కోసం సర్వే చేసి వేరివేషన్ ఎస్టిమేషన్లు పంపించాం. ప్రస్తుతం ఆ ఫైల్ ఈఎన్సీ జనరల్ దగ్గర పెండింగ్‌లో ఉంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం.
– విజయ కుమార్ రెడ్డి, ఈఈ, ఆర్డీఎస్