అలంపూర్ గుడిలో అలనాటి శిల్పాలు

అలంపూర్ గుడిలో అలనాటి శిల్పాలు

రాజుల కాలం నాటి శిల్పకళ చూడాలంటే దేవాలయాల్ని  మించిన ఛాయిస్​ ఉండదు. ‘ఆలయాల నగరం’గా పేరుగాంచిన అలంపూర్​ అలాంటిదే. జోగులాంబ గద్వాల్​ జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున అలంపూర్​లో వెలసింది శ్రీ జోగులాంబ. పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఐదోది ఈ  గుడి. ఇక్కడ అమ్మవారు ‘రౌద్ర స్వరూపిణి’గా కనిపిస్తారు. గుడి ఆవరణలోని కోనేరు అమ్మవారిని శాంతింపచేస్తుందని చెబుతారు. 

జోగులాంబ గుడి నిర్మాణ శైలి నగర  ఆర్కిటెక్చర్​లో ఉంటుంది.  గుడి మొత్తాన్ని ఒకటే రాయిని ఆధారంగా చేసుకుని కట్టడం నగర శైలి స్పెషాలిటీ.  ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిని ఎర్రని ఇసుక రాయితో కట్టారు. తుంగభద్ర, కృష్ణా నదులు కలిసే చోటు కావడంతో దీన్ని ‘దక్షిణ కాశి’ అని కూడా పిలుస్తారు. పుష్కరాలకి జనం పోటెత్తుతారు. 

దసరా సందర్భంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చండీ హోమాలు చేస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఆలయ గోడలపై పంచతంత్రం, రామాయణ, మహాభారత కాలం నాటి శిల్పాలు కనిపిస్తాయి. సెప్టెంబర్​ నుంచి మార్చి మధ్యలో ఇక్కడికి వెళ్తే బాగుంటుంది. 

ALSO  READ : ఐదుగురు పైలట్లపై రూ.21 కోట్ల చొప్పున పరిహారం.. ఆకాశా ఎయిర్ డిమాండ్

ఇవి కూడా చూడొచ్చు

అలంపూర్​కి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాసి గ్రామంలో పాపనాసి దేవాలయాలు ఉంటాయి. వీటిని రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు కట్టించారు. ఏడు, ఎనిమిదో శతాబ్దం నాటి శిల్పకళని చూడాలంటే ఇక్కడికి వెళ్లాలి. ఇక్కడ దాదాపు 20 కి పైగా శివ లింగాలు, వివిధ ఆకారాల్లో, సైజుల్లో ఉంటాయి. యజ్ఞశాల, ఆలయ పిల్లర్స్ మీద చెక్కిన అష్టాదశ శక్తిపీఠాల బొమ్మలు..  అదనపు ఆకర్షణ.