- పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్న విష సంస్కృతి
- బానిసలుగా మారుతున్న యువత, విద్యార్థులు
- కోడ్ భాషతో విచ్చలవిడిగా అమ్మకాలు
నాగర్ కర్నూల్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లాలో గంజాయి వాడకం రోజురోజుకు పెరగడం ఆందోళనకరంగా మారుతోంది. గతంలో నియోజకవర్గ కేంద్రాలకే పరిమితమైన ఈ గంజాయి ఇప్పుడు పల్లెలకు పాకుతోంది. జిల్లా కేంద్రం మొదలుకుని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో గంజాయి అందుబాటులో ఉంటున్నా, కట్టడి చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాలు నల్లమల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం గంజాయి సాగుకు కలిసి వస్తోంది. కృష్ణా తీర ప్రాంతంలో ఏపీ వైపున్న కొండల్లోని ఏటవాలు ప్రాంతాలు గంజాయి పండించే అడ్డాలుగా మారుతున్నాయి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయిని సప్లై చేస్తున్నారు. పదర, అమ్రాబాద్ మండలాల్లోని ఇప్పలపల్లి, మారడుగు, చిట్లంకుంట, లక్ష్మాపూర్ తండా, కొత్తపల్లి గ్రామాల్లో అంతర్ పంటగా సాగు చేసిన గంజాయిని ఎక్సైజ్, పోలీసులు ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి.
ఇక కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు తక్కువగా ఉంటాయనే ధీమాతో పలువురు గంజాయి సాగు చేసి అమ్ముతున్నారు. గంజాయి సాగు చేసే వారితో పాటు అమ్మే వారిపై కేసులు పెట్టడం మరిచిన డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లు సమాచారం ఇవ్వండి.. నిందితులను పట్టుకుంటామనే ప్రకటనలకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి.
ఆందోళనలో పేరెంట్స్..
గంజాయి వాడకం పెరగడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.స్టేడియం గ్రౌండ్స్, చెరువు కట్టలు, ఖాళీ వెంచర్లు, పట్టణాలకు దగ్గర్లో ఉన్న గుట్టలు గంజాయి వాడే అడ్డాలుగా మారుతున్నాయి. గంజాయి వాడిన తర్వాత బైక్స్‌తో కాంపిటేషన్ పెట్టుకుంటూ ఓవర్ స్పీడ్‌తో వెళ్లి ప్రమాదాలకు గురవడమే కాకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. గంజాయికి అలవాటు పడ్డ స్టూడెంట్స్ విపరీత ప్రవర్తనతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నా బయటికి చెప్పుకోలేకతున్నారు.
గంజాయి పొడిని ఖాళీ సిగరెట్లలో పెట్టి వాడుతున్నారు. పట్టణ శివార్లలోని ఖాళీ ప్రదేశాల్లో సాయంత్రం చీకటి పడే వేళల్లో మిణుగురు పురుగులను తలపించేలా గంజాయి సిగరెట్లు వెలుగుతున్నాయని అంటున్నారు. బైక్‌లపై ట్రిబుల్ రైడింగ్, స్కిడ్స్ చేస్తూ రోడ్లపై వెళ్లే వారికి దడ పుట్టిస్తున్నారు. గంజాయి వాడిన తర్వాత విపరీత ధోరణితో వ్యవహరిస్తూ నేరాలకు పాల్పడే మనస్తత్వం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
రెండు రోజుల కింద జిల్లా సమీక్షకు వచ్చిన ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లో పని సంస్కృతిని దెబ్బతీస్తున్న బెల్ట్‌షాపులను కంట్రోల్ చేయాలని ఆదేశిస్తే, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గంజాయి వాడకం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
హాస్టల్లే టార్గెట్..
నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్‌ను టార్గెట్ చేసి గంజాయి అమ్ముతున్నారు. రైస్, ఆయిల్ మిల్లులతో పాటు వివిధ పనులకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులు, యువత ఎక్కువగా గంజాయి వినియోగిస్తున్నారు. భారీ సాగు నీటి ప్రాజెక్టుల్లో పని చేస్తున్న కార్మికులకు 24 గంటలు గంజాయి అందుబాటులో ఉంటుందంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.
ఇటీవల జిల్లా కేంద్రంలో పోలీసులు గంజాయి అమ్ముతున్న యూపీకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే, వారికి సప్లై చేసిన వారి పేర్లు చెప్పారు. అయితే గంజాయి అమ్ముతున్న అడ్డాల సమాచారం రాబట్టాల్సిన ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఆ స్థాయిలో పని చేయడం లేదనే విమర్శలున్నాయి.