Abhishek Sharma: అభిషేక్ రెండు గంటల్లో నా క్రికెట్ కెరీర్‌ను దాటేశాడు: ఇంగ్లాండ్ దిగ్గజం

Abhishek Sharma: అభిషేక్ రెండు గంటల్లో నా క్రికెట్ కెరీర్‌ను దాటేశాడు: ఇంగ్లాండ్ దిగ్గజం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆదివారం (ఫిబ్రవరి 2) ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20లో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 37 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఈ పంజాబీ వీరుడు.. అదే జోరును కొనసాగిస్తూ  37 బంతుల్లో సెంచరీ చేసి సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. 54 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 13 సిక్స్‌‌లతో 135 పరుగులు చేసి టీ20 క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ క్రికెటర్ అలిస్టర్ కుక్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ టీమిండియా ఓపెనర్ ను అత్యుత్తమ ప్రశంస ఇచ్చాడు. కుక్ మాట్లాడుతూ.. "నా క్రికెట్ కెరీర్ లో కొట్టిన సిక్సులు అభిషేక్ శర్మ రెండు గంటల్లో బ్రేక్ చేశాడు" అని చెప్పాడు. కుక్ టెస్ట్ కెరీర్ లో 161 టెస్ట్ మ్యాచ్ లాడగా.. 291 ఇన్నింగ్స్ లో మొత్తం 11 సిక్సులు మాత్రమే కొట్టాడు. 92 వన్డేల్లో కేవలం 10 సిక్సర్లు కొట్టాడు. అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20లో మాత్రం ఒకే ఇన్నింగ్స్ లో 13 సిక్సులు బాదాడు. 

ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్.. " నా కెరీర్ లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు చూశాను. నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ల్లో ఇదొకటి". అని చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ మాట్లాడుతూ.. " 140 కి.మీ వేగంతో నిలకడగా బంతులు వేస్తున్న ఒక జట్టుపై ఆడిన టీ20 ఇన్నింగ్స్ ల్లో ఇదే బెస్ట్". అన్నాడు. ఈ మ్యాచ్ లో పలు రికార్డ్స్ ను అభిషేక్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదాడు. 10 సిక్సులతో టాప్ లో ఉన్న రోహిత్ శర్మ రికార్డును 13 సిక్సులతో బ్రేక్ చేశాడు. టీమిండియా తరపున టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు.