తెలంగాణలో పెరుగుతున్న మద్యం వ్యసనం..డ్రగ్ కల్చర్

తెలంగాణలో మద్యం వ్యసనంతోపాటు డ్రగ్​కల్చర్​ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలైన వ్యసనం మాదకద్రవ్యాల వరకు విస్తరిస్తుండటం పొంచి ఉన్న ముప్పును సూచిస్తున్నది. ఎలా ఉంటుందో చూడాలని ఉత్సాహంతో మొదలు పెడుతున్న యువతీయువకులు వాటికి బానిసలుగా మారుతున్నారు. హైదరాబాద్​ నగరంలో స్నేహితుల బర్త్​డే వేడుకల్లో, వీకెండ్ పార్టీల్లో డ్రగ్స్, గంజాయి తీసుకోవడం సాధారణమైపోయిందని ఇటీవల వెలుగు చూస్తున్న పలు ఘటనల ద్వారా స్పష్టమవుతున్నది. డ్రగ్స్​కు బానిసలవుతున్న యువత.. వాటి కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం బైకులు, ల్యాప్​టాప్​లు, ఫోన్లు చోరీ చేయడం, లేదా చైన్​స్నాచింగ్​లకు పాల్పడటం లాంటివి చేస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో అనేక సార్లు స్పష్టమైంది. ఈ డ్రగ్​ కల్చర్​హైదరాబాద్ తోపాటు చుట్టు పక్కాల శివారు ప్రాంతాలు, ఇతర జిల్లా కేంద్రాలకూ విస్తరించే ఆస్కారం ఉన్నది. అందుకే స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలపై  నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. లేదంటే తెలంగాణ యువత భవిత ప్రమాదంలో పడుతుంది. 

విద్యార్థులే లక్ష్యంగా..

హెరాయిన్, కొకైన్, ఓపియం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అమ్మకం ద్వారా కోట్ల వ్యాపారం చేస్తున్న డ్రగ్స్ మాఫియా.. విద్యార్థులను లక్ష్యంగా చేసుకొనే దందా నడిపిస్తున్నది. డ్రగ్​ పెడ్లర్లను సృష్టించుకొని వారి ద్వారా యువతను ఆకర్షించి వ్యాపారం సాగిస్తున్నట్లు ఇంతకు ముందు అనే ఘటనల్లో చూశాం. డ్రగ్ పెడ్లర్స్ నగరాల్లో చిన్న చిన్న కాఫీ షాపులను కూడా వదలకుండా విక్రయ కేంద్రాలుగా నడిపిస్తున్నారు. నిఘా వ్యవస్థల కళ్లు గప్పుతున్న ముఠాలు యథేచ్ఛగా మాదకద్రవ్యాలను సమాజంలోకి వదులుతున్నాయి. గ్రేటర్​ హైదరాబాద్​ మూడు పోలీస్​ కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది డ్రగ్ కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యాయి.  ఒక్క రాచకొండ కమిషనరేట్​పరిధిలోనే ఈ ఏడాది 94 మంది డ్రగ్స్ నేరస్తులను పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 7502.8 కిలోల గంజాయిని, 73 గ్రాముల హెరాయిన్, 63.35 గ్రాముల ఎండీఎంఏ, 38 గ్రాములు కొకైన్ స్వాధీనం చేసుకున్నామని మొన్న సీపీ మోహన్​భగవత్​ చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్​ కమిషనరేట్ల పరిధిలోనూ డ్రగ్​కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రాష్ట్ర పోలీసులు గాక కేంద్ర నిఘా సంస్థలు కూడా హైదరాబాద్​లో డ్రగ్​ ముఠాల పని పడుతున్నాయి. ఇటీవల నగరంలో డ్రగ్స్ తయారీపై పక్కా సమాచారం అందుకున్న కేంద్ర పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్(డీఆర్​ఐ)అధికారులు.. చెంగించెర్లలోని రెండు ల్యాబ్ లపై దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా మెఫెడ్రోన్ ను తయారు చేస్తున్న ముఠా ఆటకట్టించారు. రెండు ల్యాబ్ లపై ఏకకాలంలో జరిపిన దాడుల్లో రూ.50 కోట్ల విలువైన 25 కిలోల మెఫెడ్రోన్ సహా డ్రగ్స్ తయారు చేసేందుకు ఉపయోగించే ముడి సరుకు, ప్యాకింగ్ మెటీరియల్, యంత్రాలు, డ్రగ్స్ తరలించే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా నిత్యం హైదరాబాద్​లో ఎక్కడో ఓ చోట డ్రగ్స్​పట్టుపడుతూనే ఉన్నాయి. 

ఇయర్​ ఎండ్​ పార్టీలపై దృష్టి పెట్టాలి..

హైదరాబాద్​సహా ఇతర నగరాల్లో డిసెంబర్​31 ఇయర్​ఎండ్​పార్టీల్లో, పబ్​ల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్​సరఫరా, విక్రయాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిపై పోలీసులు, నార్కోటిక్స్​స్పెషల్​వింగ్​ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాను అరికట్టాల్సిన అవసరముంది. లేదంటే తెలంగాణ మరో పంజాబ్​లా మారుతుందనడంలో సందేహం లేదు. సమాజ అభివృద్ధిలో యువత పాత్రే కీలకం. అలాంటి యువతను, విద్యార్థులను నాశనం చేస్తున్న డ్రగ్​రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. ఎంత మాత్రం ఉపేక్షించినా, అది మొత్తం రాష్ట్రాన్నే నాశనం చేస్తుంది. డ్రగ్​ సరఫరా, ముఠాలో కీలక నేతలు ఉండొచ్చు గాక, లాభాల కోసం ఈ దందానే వారు ఎంచుకోవచ్చు గాక, ప్రభుత్వం వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. ముప్పు తప్పదు. భవిష్యత్ ​తరాలు బలికావాల్సిందే. ఇప్పటికే డ్రగ్స్​కు అలవాటు పడిన వారిని మామూలు వ్యక్తులుగా మార్చేందుకు డీ అడిక్షన్​సెంటర్లను ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టాలి. డ్రగ్స్​వినియోగం వల్లి కలిగే నష్టాలను స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో విరివిగా ప్రచారం చేయాలి. అవసరమైతే ఓ బోధనాంశంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారు డ్రగ్స్​వాడుతున్నట్లు ఏమాత్రం సందేహం వచ్చినా, డీ అడిక్షన్​సెంటర్లకు తీసుకువెళ్లడం, వారికి డ్రగ్స్​సరఫరా చేస్తున్న ముఠా వివరాలను పోలీసులకు చెప్పడం లాంటివి చేయాలి. స్టూడెంట్స్​, పేరెంట్స్​, యువత, పోలీసులు ఇలా సమష్టి కృషితోనే డ్రగ్స్ ను తరిమికొట్టగలం.

ఉక్కుపాదం మోపాల్సిందే..

యువత భవిష్యత్​కు, రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తున్న మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల నివారణకు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్​కమిటీ(ఏడీసీ)లు పని చేస్తాయని, తొలి దశలో హైదరాబాద్​లో 255 డిగ్రీ కాలేజీల్లో ఇవి పనిచేస్తాయని ఇటీవల హైదరాబాద్​ కమిషనర్​ సీవీ ఆనంద్​చెప్పిన మాటలు స్వాగతించదగినవి. ఇలాంటి ఏడీసీలను రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఏర్పాటు చేసి, అవి పక్కాగా పని చేసేలా కార్యాచరణను రూపొందించాలి. హెచ్‌‌న్యూ(హైదరాబాద్‌‌ నార్కోటిక్స్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ వింగ్‌‌)ను ప్రారంభించి.. డ్రగ్స్‌‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌‌ను తీర్చిదిద్దుతామని ఇటీవల పోలీస్​వార్షిక నివేదిక విడుదల సమయంలో హైదరాబాద్​ సీపీ చెప్పారు. ఈ స్పెషల్​ఎన్​ఫోర్స్​మెంట్​వింగ్​ను వెంటనే ప్రారంభించి, వరంగల్, కరీంనగర్​లాంటి నగరాలకు వాటి సేవలను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 
- దేవేందర్​ ముంజంపల్లి,కాకతీయ యూనివర్సిటీ