ఏరులై పారుతున్న మద్యం

నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నవీన్ ను అతని స్నేహితుడు హరిహరకృష్ణ అతి కిరాతకంగా హత్య చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. నవీన్, హరిహరకృష్ణ ఇద్దరు ఇంటర్మీడియట్ చదివే నాటి నుంచి స్నేహితులు. గత ఏడేండ్లుగా వారి మధ్య స్నేహం ఉంది. ఇంటర్మీడియట్ చదువుతున్న కాలం నుంచి నవీన్ నిహారిక అనే అమ్మాయినీ ప్రేమిస్తున్నాడనీ చెబుతున్నారు. బీటెక్ చదవడం కోసం నవీన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండకు వెళ్లాడు. ఈ కాలంలో హరిహరకృష్ణ నిహారికతో పరిచయం పెంచుకొని తను కూడా ప్రేమిస్తున్నానని తనతో సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో నవీన్, హరిహరకృష్ణ మధ్య ప్రేమ వ్యవహారంలో ఘర్షణలు వచ్చాయి. దీంతో నవీన్ పై హరిహరకృష్ణ ద్వేషాన్ని పెంచుకొని, పార్టీ చేసుకుందాం రమ్మని చెప్పి అబ్దుల్లాపూర్ మెట్ లో అతి కిరాతకంగా చంపేశాడు. ఈ వ్యవహారంలో ప్రత్యక్ష నిందితుడిగా హరిహరకృష్ణ మనకు కనబడుతున్నాడు. అయితే అతన్ని ఆ విధంగా ప్రేరేపించిన కారణాలను సమాజం నేడు పరిశీలించాలి. ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్న మద్యం, మందు, గంజాయిలను అరికట్టాలి. 


శివారు ప్రాంతాల కాలేజీల్లో..


మన రాష్ట్రంలో ఇంజినీరింగ్, మెడిసిన్ చదివే విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్, గంజాయి ముఠా వారిని టార్గెట్ చేస్తూ అమ్మతున్నారు. హైదరాబాద్ శివారులో ఉన్న అనేక ఇంజినీరింగ్, మెడిసిన్ కాలేజీల దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. దీనికి తోడు ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్నప్పుడు విద్యార్థుల మధ్య బెట్టింగ్ లు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ లో క్రైమ్ స్టోరీస్, నేర సాహిత్యం కూడా విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రైమ్ స్టోరీస్ చూసిన యువత వాటిని వారు చేస్తున్న నేరాలకు వాడుతున్నారు. ఆలోచన లేకుండా చేస్తున్న ఇలాంటి పనుల వల్ల వారి జీవితాలను కోల్పోతున్నారు. నవీన్ ఘటనను పరిశీలిస్తే చిన్నతనంలోనే ఆకర్షణలకు గురవడం, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత హరిహరకృష్ణ నవీన్ పై ద్వేషం పెంచుకోవడం, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుమందులకు అలవాటు పడటం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, యూట్యూబ్ లో చూసిన క్రైమ్ స్టోరీస్ ఆధారంగా హరిహరకృష్ణ నవీన్ ను హతమార్చడం జరిగాయి. అంటే ఏ కారణాలు ప్రేరేపించి ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నవీన్ ను హత్య చేయడం అత్యంత బాధాకరం. నవీన్ ను హతమార్చిన హరిహరకృష్ణను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిందే. నవీన్ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. క్షణికావేశంలో యువత తీసుకుంటున్న ఈ నిర్ణయాలు మొత్తం వారి జీవితాన్ని బలిపెడుతున్నాయి. వీటి నుంచి జాగ్రత్త వహించాల్సిన అవసరం నేడు ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి బెట్టింగ్ లాంటివి నిషేధించాలి. వాటి సరఫరాను అడ్డుకోవాలి. యువత పెడ ధోరణి పట్టకుండా చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించాలి. తల్లిదండ్రులకు వారి పిల్లలపై పర్యవేక్షణ ఉండాలి. యువత ఆ వైపుగా ప్రయాణం చేయకుండా చూడాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయగలం. లేకుంటే ఇంకా అనేకమంది నవీన్ లు బలి అవుతూనే ఉంటారు. మరింతమంది హంతక హరిహరకృష్ణలు పుట్టుకొస్తూనే ఉంటారు. హంతకున్ని శిక్షిద్దాం సరే మరి పరోక్షంగా వాటికి కారణమవుతూ, ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేద్దాం?


ఏరులై పారుతున్న మద్యం


రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. న్యూఇయర్ లాంటి వేడుకలకు టార్గెట్లు పెట్టి మరి ప్రభుత్వమే అమ్మకాలకు సిద్ధమవుతుంది. ప్రతి గల్లీలో, చౌరస్తాలో, రహదారుల పక్కన పచ్చని పంట పొలాల్లో మద్యం షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. రాష్ట్ర ప్రభుత్వంకు మద్యం ఆదాయ వనరుగా మారిపోయింది. దీంతోపాటు నేడు రాష్ట్రంలో విద్యార్థులే లక్ష్యంగా విద్యాసంస్థల దగ్గర భారీగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. హైదరాబాద్ అబిడ్స్ లో ఒక ప్రైవేట్ స్కూల్ దగ్గర చిన్నపిల్లలకే గంజాయి అమ్ముతూ పట్టుపడ్డ ఘటనలు ఇటీవల వెలుగు చూశాం. చిన్నపిల్లల నుంచి సెలబ్రిటీల వరకు గంజాయి, డ్రగ్స్ కు అలవాటవుతున్నారు. వీటి వెనకాల భారీ స్థాయిలో మాఫియా ముఠాలు ఉన్నాయి. విద్యార్థులు లక్ష్యంగా డ్రగ్స్ ముఠా భయంకరంగా అమ్మకాలను కొనసాగిస్తుంది. ఇటీవల కాలంలోనే టాలీవుడ్ లో ప్రముఖ యాక్టర్లు, దర్శకుల మీద డ్రగ్స్ తీసుకున్నారని కేసులు నమోదు చేశారు. వీరికి నైజీరియా నుంచి ఇవి పంపిణీ అవుతున్నాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తరువాత వీటిని అరికట్టడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమవుతున్నారు. 

- పి. మహేష్,
పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షుడు