- ఆలేరు, భువనగిరిలో సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటు
- వచ్చే నెలలో అవిశ్వాసం పెట్టేందుకు ఏర్పాట్లు
- మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు
- పాత చట్టం ప్రకారమే ప్రక్రియ చేపట్టనున్న అధికారులు
యాదాద్రి, వెలుగు : ఆలేరు, భువనగిరి మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసానికి రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్కు చెందిన వీరిపై ఆ పార్టీ నుంచే తిరుగుబాటు మొదలైంది. దాదాపు ఏడాది కిందే అవిశ్వాస నోటీసులు ఇచ్చిన కౌన్సిలర్లు ఇప్పుడు వాటిని ముందుకు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు సైతం వారికి మద్దతు ఇస్తున్నారు. అయితే తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-–2019 ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండడంతో అధికారులు ఏపీ మున్సిపాలిటీ చట్టం-1965 ఆధారంగా జీవో 835 ప్రకారం అవిశ్వాసంపై యాక్షన్ తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఏడాది కిందే అవిశ్వాసం నోటీసులు
2023 జనవరితో మున్సిపాలిటీ చైర్మన్ల పదవీ కాలం మూడేండ్లు ముగియడంతోనే యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవిశ్వాసంపై ముందుకు వెళ్లకుండా చూసుకున్నది. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధ సహా పలువురు చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించి స్టే కూడా పొందారు.
కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడడంతో అవిశ్వాసాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపల్చైర్మన్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో.. అవిశ్వాసం పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. భువనగిరి, ఆలేరులో మాత్రం తప్పనిసరిగా అవిశ్వాసం పెట్టనున్నట్లు తెలిసింది.
వచ్చే నెలలో అవిశ్వాసం?
భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్15 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్11, బీజేపీ 7, ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు గెలిచారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఇద్దరు ఇండిపెండెంట్ల ఓట్లతో బీఆర్ఎస్ చైర్మన్, వైఎస్ చైర్మన్పదవులు దక్కించుకుంది. అనంతరం ఇద్దరు కాంగ్రెస్, ఓ బీజేపీ కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ బలం 20కి చేరింది. వీరిలో 16 మంది కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్లపై అసంతృప్తిగా ఉన్నారు. వీరు ఈ ఏడాది ఫిబ్రవరి 7న అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.
అంతేకాదు ఇటీవల నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు కాకుండా చైర్మన్ పదవి ఆశిస్తున్న కౌన్సిలర్ అజిమ్ ఆధ్వర్యంలో 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలో టూర్‌కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టర్‌ను కలిసి అవిశ్వాసం పెట్టాలని కోరనున్నారని తెలిసింది. ఈ మేరకు బీజేపీకి కౌన్సిలర్లతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే బీజేపీ చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవి ఇస్తే మద్దతిస్తామని మెలిక పెట్టిందని తెలిసింది. ఆలేరులో 12 వార్డులకు గాను బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్పోగా మిగిలిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్‌ను వ్యతిరేకిస్తున్నారు.
ఈ మేరకు 2023 జనవరి 31న అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు పట్టుమీద ఉండడంతో వచ్చే నెలలో అవిశ్వాసం మీటింగ్జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆలేరు, భువనగిరి మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఇటీవల అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డిని కలిసి పాత నోటీసులు చెల్లుతాయా..? కొత్తగా ఇవ్వాలా.. అనే అంశంపై క్లారిటీ తీసుకున్నారు.
పాత చట్టం ప్రకారమే
కొత్త చట్ట ప్రకారం నాలుగేండ్ల వరకు చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. ప్రస్తుత మున్సిపాలిటీ చైర్మన్ల పదవి కాలం వచ్చే నెల జనవరితో నాలుగేండ్లు అవుతుంది. అయితే కొత్తచట్టం బిల్లు గవర్నర్వద్ద పెండింగ్‌లో ఉన్నా.. అందులో పేర్కొన్న సేవింగ్క్లాజ్ప్రకారం పాత చట్టం ప్రొసిజర్తో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అక్టోబర్ 6న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏపీ మున్సిపాలిటీ చట్టం-1965 ఆధారంగా 2008లో జారీ చేసిన జీవో నెంబర్ 835 ప్రకారం అవిశ్వాసంపై ముందు కెళ్లవచ్చు. ఇందులో భాగంగానే అధికారులు వార్డుల్లో ఏమైనా ఖాళీలు ఏర్పడ్డాయా.?
ఓటు హక్కు కలిగిన ఎక్స్అఫీషియో మెంబర్లలో ఏమైనా ఖాళీగా ఉన్నాయా.? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అవిశ్వాసం డేట్ నిర్ణయం జరిగిన తర్వాత కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్లకు ఫారం-2 నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసు ఇచ్చినప్పటి నుంచి15 వర్కింగ్ డేస్ లేదా నెల రోజుల్లో మున్సిపాలిటీలో అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.